గుంటూరులో డ్రగ్స్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. పక్కా సమాచారంతో దాడులు నిర్వహించి అయిదుగురు సభ్యుల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 2.6 కేజీల గంజాయి, ఇద్దరు వీదేశీయుల పాస్ పోర్టులు, రెండు ద్విచక్ర వాహనాలు, సెల్ ఫోన్, రూ.1000 నగదుతో పాటు... డ్రగ్స్ తయారు చేసే పరికరాలు, సింథటిక్ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు అర్బన్ ఎస్పీ రామకృష్ణ తెలిపారు. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. గుంటూరు నల్లపాడు పోలీస్స్టేషన్ పరిధిలోని హౌసింగ్ బోర్డులో పది రోజుల క్రితం డ్రగ్స్ తయారు చేస్తున్నారన్న సమాచారం మేరకు మహ్మద్ షాద్ అనే వీదేశీయుడిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. అతనిని విచారించి డ్రగ్స్ సరఫరా చేస్తున్న... మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వీరికి సహకరిస్తున్న ముగ్గురు యువకులు పరారీలో ఉన్నారని ఎస్పీ తెలిపారు. మరో ఇద్దరు ప్రస్తుతం జైలులో ఉన్నారని చెప్పారు. వీరు డ్రగ్స్ తయారు చేసి విద్యార్థులు, యువతకు విక్రయిస్తున్నారని తెలిపారు. యువత మత్తుపదార్థాలకు బానిసలుగా మారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ సూచించారు. తల్లిదండ్రులు జాగ్రత్త వహించాలని ... తమ పిల్లల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ఇదీ చదవండి