గుంటూరు శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నగరపాలక సంస్థ పరిధిలోని పట్టణ ఆరోగ్య కేంద్రాల మెడికల్ అధికారులు, ఏఎన్ఎంలతో జాయింట్ కలెక్టర్ ప్రశాంతి ప్రత్యేక సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రతి రోజు నమోదు అయ్యే పాజిటివ్ కేసులను సంబంధిత పట్టణ ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ పరిశీలించి.. వారి లక్షణాలను బట్టి వారు హోం ఐసోలేషన్‌లో ఉండేలా చూడాలన్నారు. కొవిడ్ కేర్‌కి వెళ్లాలా, హాస్పిటల్‌కి వెళ్లాలా అనేది నిర్ణయించాలన్నారు. ఇప్పటికే జరిగిన ఫీవర్ సర్వేలో కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారు, పాజిటివ్ వచ్చిన వారి ప్రైమరీ కాంటాక్ట్స్‌కి తొలి ప్రాధాన్యతగా టెస్ట్ లు చేయించాలన్నారు.
సచివాలయ పరిధిలో కొవిడ్ ప్రోటోకాల్ ప్రకారం ఏఎన్ఎంలు పని చేయాలని.. వారిని మెడికల్ ఆఫీసర్ పర్యవేక్షించాలన్నారు. నగరపాలక సంస్థ నుంచి నియమితులైన నోడల్ అధికారులు కూడా సచివాలయాల వారిగా.. ప్రతి రోజు కేసుల వివరాలు, టెస్ట్ లు, ట్రేసింగ్ లను గమనించాలన్నారు. ప్రభుత్వ కేంద్రాలు కాకుండా కొందరు ప్రైవేట్ ల్యాబ్‌ల్లో రక్త పరీక్షలు, ఎక్స్ రే చేయించుకొని, పాజిటివ్‌గా హాస్పిటల్స్ లో చేరుతున్నారన్నారు. కానీ ఏఎన్ఎం స్థానికంగా అందుబాటులో ఉండి ప్రజలకు కొవిడ్ పట్ల అవగాహన కల్పించి ఆరోగ్య సమస్యలు ఉంటే.. తమకు తెలియచేయాలని భరోసా ఇచ్చి ఉంటే ప్రైవేట్ కేంద్రాలకు ప్రజలు వెళ్ళరని అన్నారు.
అలాగే హోం ఐసోలేషన్, హోం క్వారంటైన్లో ఉండేవారిని ప్రతి రోజు గమనిస్తూ.. ఎటువంటి సమస్యలు ఎదురైనా మెడికల్ ఆఫీసర్ దృష్టికి తీసుకురావాలన్నారు. కొవిడ్ పరీక్షలు చేయించుకున్న వారు తప్పనిసరిగా ఫలితాలు వచ్చే వరకు హోం ఐసోలేషన్ లో ఉండేలే చర్యలు తీసుకోవాలని సూచించారు. కొవిడ్ పరీక్షలు తొలుతగా ప్రైమరి కాంటాక్ట్స్, తర్వాత కొవిడ్ అనుమానిత లక్షణాలు ఉన్నవారికే చేయాలన్నారు. హోం క్వారంటైన్ లో ఉండేవారు నిర్దేశిత రోజులు ఇంటిలోనే ఉండేలా చూడాలన్నారు. ఈకార్యక్రమంలో నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా అనూరాధ, సిబ్బంది పాల్గొన్నారు.
ఇదీ చదవండి: రేపటి నుంచే పగటి కర్ఫ్యూ.. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకే దుకాణాలు