పశ్చిమగోదావరి జిల్లా భీమవరంలోని పలు కేంద్రాల్లో బుధవారం కొవిషీల్డ్ వ్యాక్సిన్ వేశారు. ఓ కేంద్రంలో 100 మందికి టీకా వేసినట్లు వివరాలు నమోదు చేయగా ఎనిమిదిన్నర వ్యాక్సిన్ సీసాలు (వయల్స్) మాత్రమే వినియోగించినట్లు అధికారులు గుర్తించారు. ఒక్కో వయల్‌లో 10 డోసులు ఉంటాయి. వంద మందికి టీకా వేస్తే పది వయల్స్ ఖాళీ అవ్వాల్సి ఉండగా కొన్ని డోసులు మిగలడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
మరోపక్క కొందరు సిబ్బంది ఉద్దేశపూర్వకంగా తక్కువ మోతాదులో టీకా మందు వేసి మిగిలిన వయల్స్‌ను పక్కదారి పట్టిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ మందును అనధికారికంగా విక్రయించి తిరిగి ఖాళీ వయల్స్‌ను ప్రభుత్వాసుపత్రుల్లో అప్పగిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. వాక్సిన్ వినియోగంలో హెచ్చుతగ్గులపై జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులకు ఫిర్యాదు చేశామని భీమవరం తహసీల్దారు ఏవీ రమణారావు చెప్పారు. ఈ వ్యవహారంపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: కుటుంబాల్లో కరోనా కల్లోలం..ఒకే ఇంట్లో ఇద్దరు, ముగ్గురేసి మృత్యువాత