Attack on Subbarao Gupta Case: వైకాపా నాయకుడు సుబ్బారావు గుప్తాపై దాడి చేసిన సుభాని అరెస్ట్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను డీఎస్పీ నాగరాజు వెల్లడించారు.
ఏం జరిగిందంటే...?
‘మోకాళ్ల మీద కూర్చో.. దండం పెట్టు..వాసన్నకు (మంత్రి బాలినేని) క్షమాపణ చెప్పు.. రెండు నిమిషాల్లో నరికేస్తాం.. నిన్ను..’ అంటూ ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన వైకాపా కార్యకర్త సోమిశెట్టి సుబ్బారావు గుప్తాపై అదే పార్టీకి చెందిన మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడటం తీవ్ర సంచలనం కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగ్గా సంబంధిత వీడియో సోమవారం వెలుగులోకి వచ్చింది.
క్షమాపణలు చెప్పించిన సుభానీ..
గుంటూరులోని బస్టాండు సమీపంలోని ఓ లాడ్జిలో సుబ్బారావు తలదాచుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న బాలినేని అనుచరులు కొందరు ఆదివారం సాయంత్రం 3.40గంటల సమయంలో ఒక పోలీసు వాహనంతో పాటు మరో ప్రైవేటు వాహనంలో ఆ లాడ్జి వద్దకు చేరుకున్నారు. సుభానీ అనే వ్యక్తి సుబ్బారావు గుప్తాపై దాడికి దిగారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ పదే పదే దాడి చేశారు. తాను మధుమేహంతో బాధపడుతున్నాననీ, తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని.. తనను వదిలిపెట్టాలని గుప్తా వేడుకున్నా వినిపించుకోకుండా దాడి చేశారు. ‘అన్నా మీ కాళ్లు పట్టుకుంటా.. నేను చిన్నప్పటి నుంచి ఆయనకు సేవ చేశా.. పార్టీలో ఏం జరుగుతుందో చెప్పా.. అన్నా.. అన్నా..నీకు దండం పెడతా.. చెప్పేది విను.. ప్లీజ్.. ప్లీజ్...’ అని కాళ్లావేళ్లా పడినా సుభానీ వినిపించుకోలేదు. తీవ్ర స్వరంతో దుర్భాషలాడుతూ గుప్తాను కొట్టారు. ‘చంపేస్తా.. ఎవరు చెబితే నువ్వు మాట్లాడావ్, రెండు నిమిషాల్లో నిన్ను ఏసేస్తాం’ అంటూ తీవ్రస్వరంతో బెదిరించారు. సుభానీతో పాటు మరో వ్యక్తి గుప్తాను చొక్కా పట్టుకుని మంచం మీద నుంచి కిందకు లాక్కొచ్చి మోకాళ్లమీద కూర్చోబెట్టి దండం పెట్టిస్తూ మంత్రి బాలినేనికి క్షమాపణ చెప్పించారు. మొత్తం ఈ ఉదంతాన్ని చిత్రీకరించారు. ఈ వీడియో సోమవారం బయటకు రావడంతో తీవ్ర కలకలం రేపింది.
ఘటనపై కేసు నమోదు..
సుబ్బారావు గుప్తా నివాసంపై దాడి, గుంటూరులోని లాడ్జిలో అతనిని కొట్టిన సంఘటనలపై ఒంగోలు ఒకటో పట్టణ పోలీసుస్టేషన్‌లో సోమవారం రాత్రి కేసు నమోదైంది. తొలుత సుబ్బారావు భార్య నాగమణి, పిల్లలను ఒంగోలు ఒకటో పట్టణ సీఐ కె.వి.సుభాషిణి స్టేషన్‌కు తీసుకెళ్లారు. శనివారం రాత్రి ఏం జరిగిందీ, ఆ ఇంటి మీదకు వచ్చి దౌర్జన్యం చేసిన సంఘటనపై ఆరా తీసి పంపించారు. అనంతరం సుబ్బారావు గుప్తా నుంచి ఫిర్యాదు స్వీకరించారు. తాను వైకాపా కార్యకర్తను కావడంతో తన ఇంటిపై జరిగిన దాడి విషయంలో తొలుత ఫిర్యాదు చేయలేదని.. మరోసారి గుంటూరులో తనపై భౌతిక దాడికి పాల్పడ్డారన్నారు. కుటుంబ సభ్యుల ఆందోళన నేపథ్యంలో ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పారు. ఈ 2 సంఘటనలపై కేసులు నమోదయ్యాయి.
గుప్తా వ్యాఖ్యలు... పలువురి నుంచి బెదిరింపు
ఈ నెల 12న బాలినేని పుట్టినరోజు వేడుకల్లో మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అంబటి రాంబాబు, వల్లభనేని వంశీ, ద్వారంపూడి చంద్రశేఖర్‌లపై సుబ్బారావు గుప్తా వ్యాఖ్యలు చేసారు. వారి వ్యవహార శైలితో పార్టీకి తీరని నష్టం జరుగుతోందని అన్నారు. దీంతో ఆయనకు సొంత పార్టీలోని పలువురి నుంచి బెదిరింపులు అధికమయ్యాయి. ఒంగోలు లంబాడీడొంకలోని ఆయన నివాసంపై శనివారం రాత్రి కొందరు యువకులు దాడి చేశారు. దీంతో సుబ్బారావు గుప్తా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అయితే సోమవారం సుబ్బారావు గుప్తాకు సంబంధించిన ఓ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గుంటూరులోని ఓ లాడ్జిలో తలదాచుకుంటున్న గుప్తాపై మంత్రి బాలినేని అనుచరులు దాడికి పాల్పడ్డారు.
ఇదీ చదవండి: