బాలలు, గర్భిణీలు, బాలింతలకు మెరుగైన పౌష్టికాహారం అందించేందుకు వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, వైఎస్ఆర్ సంపూర్ణ పోషన్ ప్లస్ పథకాలను ప్రభుత్వం ప్రారంభించింది. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్... కంప్యూటర్ ద్వారా ఈ పథకాలను ప్రారంభించారు. అనంతరం పౌష్టికాహార కిట్లను బాలలకు అందజేశారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ యాప్, ప్యాకెట్ బుక్, ఎస్‌ఓపీ బుక్‌లెట్‌ను సీఎం ఆవిష్కరించారు. మంత్రులు తానేటి వనిత, బొత్స సత్యనారాయణ, ఎం.శంకర నారాయణ, సీఎస్ నీలం సాహ్ని, మహిళా శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి ఏఆర్ అనురాధ, ఆ శాఖ డైరెక్టర్ కృతికా శుక్లాతో పాటు పలువురు అధికారులు, పథకాల లబ్ధిదారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ పథకాల అమలు కోసం ఏటా రూ.1863.11 కోట్ల వ్యయం చేయనున్నట్లు సీఎం తెలిపారు. గిరిజనేతర, మైదాన ప్రాంతాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం అమలు చేస్తుండగా... గిరిజన ప్రాంతాల్లోని 77 మండలాల్లో వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం అమలు చేయనున్నారు. పలు జిల్లాల్లోని లబ్ధిదారులతో ముఖ్యమంత్రి జగన్... వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడారు. గతంలో అంగన్వాడీ కేంద్రాలు, చిన్న పిల్లలు, గర్భిణీలు, బాలింతల కోసం చాలీ చాలని నిధులు ఇచ్చేవారని, ఏటా రూ.500 కోట్లు ఇస్తే ఎక్కువ అన్నట్లుగా అప్పట్లో ఉండేదని సీఎం ప్రస్తావించారు. రాష్ట్రంలో చాలామందికి పోషకాహారం లభించడం లేదని, వారందరిలో మార్పు తీసుకువచ్చేందుకు ఈ పథకాలను అమలు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ అన్నారు. ఆంగ్ల మాధ్యమాన్ని వ్యతిరేకిస్తున్న వారిలో రూపం మార్చుకున్న అంటరానితనం కనిపిస్తోందని పేర్కొన్నారు. వారందరి మనస్తత్వంలో మార్పు రావాలని దేవుణ్ని ప్రార్థిస్తున్నానని అన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 55,607 అంగన్వాడీలలో నాడు-నేడు ద్వారా వాటి రూపురేఖలు మార్చబోతున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. వాటిని ప్రీ ప్రైమరీ కేంద్రాలుగా మార్పు చేస్తున్నామని, పీపీ–1, పీపీ–2 మొదలు పెడుతున్నామని వెల్లడించారు. పేద పిల్లలు కూడా గొప్పగా చదవాలి, రాణించాలన్న ఉద్దేశంతో మార్పులు చేస్తున్నామని పేర్కొన్నారు. కొవిడ్ సమయంలో ఆదాయాలు పడిపోయాయని, మరోవైపు గత ప్రభుత్వం చేసిన బకాయిలను తీరుస్తూ ఒడుదొడుకులను ఎదుర్కొంటున్నామని చెప్పారు.
ఇదీ చదవండి: పనుల కనికట్టు..అవినీతి గుట్టురట్టు