విశాఖలో 'వైఎస్సార్ కాపు నేస్తం' పథకాన్ని విశాఖ కలెక్టరేట్లో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు మంత్రులు చెక్ అందజేశారు. కాపులకు ఎన్నికల ముందు ఇచ్చిన హామీని వైకాపా ప్రభుత్వం నిలబెట్టుకుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. అన్ని వర్గాల ప్రజలను ఆదుకునే దిశగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు అన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ద్వారకా తిరుమలలో జరిగిన కాపు నేస్తం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కాపు నేస్తం ద్వారా లబ్ధి పొందిన మహిళలతో కలిసి ఆయన ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం మహిళలంతా ఎమ్మెల్యేను సత్కరించి శ్రీవారి చిత్రపటాన్ని బహుకరించారు.
చిత్తూరు జిల్లాలో 'వైఎస్సార్ కాపు నేస్తం' ద్వారా 8,218 మంది లబ్ధిదారులకు రూ.12.32 కోట్ల చెక్కును ఉపముఖ్యమంత్రి కె. నారాయణ స్వామి అందజేశారు. ప్రతి పేదవారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు కుల, మత, పార్టీ, రాజకీయాల అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో 2.36 లక్షల మంది లబ్ధి పొందుతున్నట్లు వివరించారు.