స్థానిక ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుంచి గుంటూరు జిల్లా పల్నాడులో తీవ్ర అలజడి నెలకొంది. ప్రతిపక్ష పార్టీల నుంచి పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రాని పరిస్థితి ఏర్పడింది. ఫలితంగా పల్నాడులో మెజార్టీ స్థానాల్లో అధికార పార్టీ అభ్యర్థులు మాత్రమే బరిలో ఉన్నారు. నామినేషన్ల చివరి రోజున కూడా తెదేపా, జనసేన అభ్యర్థులతో బలవంతంగా నామినేషన్లు ఉపసంహరింపజేశారు.
మాచర్ల నియోజకవర్గంలో ఐదు, గురజాల నియోజకవర్గంలో రెండు, రేపల్లె నియోజకవర్గంలో ఒక జడ్పీటీసీ స్థానంలో వైకాపా అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారు. పిడుగురాళ్లలో రెండు జడ్పీటీసీలు ఏకగ్రీవమయ్యాయి. ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తనయుడు కోటయ్య పిడుగురాళ్ల నుంచి ఎన్నికయ్యారు. మొత్తంగా జిల్లాలో 54 జడ్పీటీసీలకు ఎన్నికలు జరుగుతుండగా.... 8 స్థానాలను వైకాపా ముందుగానే కైవసం చేసుకున్నట్లైంది. అధికార పార్టీ నేతల దాడులు, బెదిరింపులతోనే ఈ భయానక పరిస్థితి నెలకొందని తెదేపా సహా మిగిలిన పక్షాలు ఆరోపిస్తున్నాయి. దీనికి మాచర్లలో తమ నేతలపై జరిగిన దాడిని తెదేపా నేతలు ఓ ఉదాహరణగా చెబుతున్నారు.
71లో 70 ఏకగ్రీవం
జిల్లాలో 805 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా.... వాటిలో 190కి పైగా ఏకగ్రీవంగా వైకాపా పరమయ్యాయి. అందులో మాచర్ల నియోజకవర్గంలో 71 ఎంపీటీసీలుండగా.. 70 చోట్ల వైకాపా ఏకగ్రీవమైంది. గురజాల నియోజకవర్గంలో 57 ఎంపీటీసీలకు గాను.. 47చోట్ల వైకాపా ఏకగ్రీవం చేసుకుంది.
నిలిచిన పద్మావతి..
దుర్గి మండలం ధర్మవరంలో మాత్రం జనసేన అభ్యర్థిగా బరిలో నిలిచారు. తోట పద్మావతి అనే మహిళ బెదిరింపులకు వెరవకుండా బరిలో నిలిచింది. తనను చివరి వరకు తీవ్రంగా బెదిరించారని, కుటుంబసభ్యులపై కేసులు పెట్టారని సదరు మహిళ తెలిపింది. వేటికీ లొంగకపోవడంతో డబ్బు ఆశ కూడా చూపారని చెబుతుంది. బరిలో ఉన్న 31 మంది నుంచి నామపత్రాలను విరమింపజేసిన అధికార పార్టీ ఎత్తుగడ.... పద్మావతి విషయంలో మాత్రం పారలేదు. ఇక తెలుగుదేశం 5 చోట్ల, స్వతంత్రులు మరో 5 చోట్ల పోటీ లేకుండా గెలుపొందారు.
ఇదీ చదవండి : 'స్థానికం'లో జిల్లాలకు జిల్లాలే వైకాపా పరం