గత రెండేళ్లలో 6.03 లక్షల ప్రభుత్వోద్యోగాలు కల్పించినట్లు ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటన అంకెల గారడీ అని శాసనమండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు (yanamala ramakrishnudu) ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న జగన్ రెడ్డి మాటతప్పి, మడమతిప్పి కోటిమంది ఉపాధి పోగొట్టారని మండిపడ్డారు. ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలపై పారదర్శకత ఉంటే ఫోన్ నెంబర్లు, సంబంధిత వివరాలను వెబ్ సైట్లో పెట్టాలని డిమాండ్ చేశారు.
'వైకాపా పాలనలో కొత్తగా ఇచ్చిన వాటికంటే పోయిన ఉద్యోగాలే 10 రెట్లు ఎక్కువ. పక్షం రోజుల వ్యవధిలో ప్రకటనల్లో ఉద్యోగాలు కల్పించిన సంఖ్యను 4.77లక్షల నుంచి 6.03లక్షలకు పెంచేసుకున్నారు. 15రోజుల్లోనే 1.25లక్షల ఉద్యోగాలు ఎలా ఇచ్చారు. 2.30 లక్షల ఖాళీలకు గాను 10వేల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి చేతులు దులుపుకుంటారా. ఆర్టీసీ, అవుట్ సోర్సింగ్ సిబ్బందిని కలిపి కొత్త ఉద్యోగాలిచ్చినట్లు దొంగ లెక్కలు చెప్తున్నారు. కొవిడ్ నివారణకు మూడునెలల కోసం తాత్కాలికంగా తీసుకున్న 26వేలమందిని కూడా ఉద్యోగులుగా చూపడం హాస్యాస్పదం. వాలంటీర్లు స్వచ్ఛంద సేవకులు మాత్రమే అని చెప్పిన జగన్ రెడ్డి వారిని కూడా ఉద్యోగులుగా చూపడం మభ్యపెట్టడమే. కీలకమైన గ్రూప్-1 ఉద్యోగాల పరీక్షల్లో అక్రమాలు చేసి వేలాది మందిని మానసిక క్షోభకు గురిచేశారు. బీసీ బ్యాక్ లాగ్ పోస్టులు ఎందుకు చూపలేదు. రెండేళ్లలో డీఎస్సీ ప్రకటన లేదు. రేషన్ వాహనాల ఉద్యోగాల పేరుతో నిరుద్యోగులను మూటలుమోసే కూలీలుగా మార్చారు' - యనమల రామకృష్ణుడు, తెదేపా నేత
ఇదీ చదవండి:
AP Jobs: జాబ్ క్యాలెండర్ విడుదల.. ఇకనుంచి ఇంటర్వ్యూలు లేవ్!