ముఖ్యమంత్రి జగన్రెడ్డి తన నిర్లక్ష్యంతో ఇంకెంతమంది ప్రాణాల్ని బలిపెడతారని శానసమండలి ప్రధాన ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు ధ్వజమెత్తారు. "సీఎం అసమర్థ చర్యల కారణంగానే రాష్ట్రంలో మరణమృదంగం మోగుతోంది. రాష్ట్రంలో ఎంత ఆక్సిజన్ అవసరం, ఎంత ఉత్పత్తి అవుతోంది, ఇతర రాష్ట్రాల నుంచి ఎంత సరఫరా అవుతుందనే దానిపై ప్రభుత్వానికి అవగాహన లేదు. పక్షం రోజుల్లో ఆక్సిజన్ అందక 77మంది.. కుటుంబ సభ్యుల కళ్లెదుటే ప్రాణాలు కోల్పోయారు. ఇవన్నీ ప్రభుత్వ హత్యలే. తమ చేతకాని తనాన్ని వైద్యులపై నెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు.
తిరుపతి రుయా ఆసుపత్రిలో కేవలం 45నిమిషాల వ్యవధిలో 11మంది చనిపోతే ఆరోగ్యమంత్రి లేదా, జిల్లామంత్రులు ఆసుపత్రిని సందర్శించకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. మహారాష్ట్ర, దిల్లీ వంటి రాష్ట్రాలు సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకుంటే ఏపీలో మాత్రం వరుస ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి వ్యవహరించిన రీతిలో జగన్ రెడ్డి తాడేపల్లి రాజప్రసాదంలో ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తూ రాక్షసానందం పొందుతున్నారు. ఆక్సిజన్ లేక పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతుంటే న్యాయస్థానానికి తప్పుడు అఫిడవిట్లు ఇస్తూ, ప్రతిపక్షాలపై ఎదురుదాడికి దిగుతున్నారు. అసమర్థ పాలన వల్ల ఉన్న సమస్యలు పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి." అని ఓ ప్రకటనలో దుయ్యబట్టారు.
ఇదీ చదవండి