ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు అందక అవస్థలు పడుతున్నారు. వారం నుంచి పది రోజుల్లో బ్యాంకు ఖాతాల్లో జమయ్యే డబ్బులు నాలుగు వారాలైనా అందలేదు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా)లో రాష్ట్రవ్యాప్తంగా రూ.1,000 కోట్లకుపైగా వేతనాలు చెల్లించాల్సి ఉంది. రెండేళ్లుగా ఉపాధి పనులకు హాజరయ్యే కూలీల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. రాష్ట్ర, రాష్ట్రేతర ప్రాంతాలకు వలస వెళ్లిన కూలీలు కొవిడ్‌తో మళ్లీ స్వగ్రామాలకు చేరుకొని నరేగా పనులకు వెళుతున్నారు.
గత నెలలో ఒకేరోజు 35 లక్షల మందికిపైగా పనుల్లో పాల్గొన్నారు. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో వారం నుంచి పది రోజుల్లో వేతనాలు చెల్లించారు. కానీ.. రాష్ట్రంలో మే 27 నుంచి జూన్ 2, జూన్ 3 నుంచి 9, 10 నుంచి 16, 17 నుంచి 23 మధ్య చేసిన నాలుగు వారాల పనులకు కూలీలకు వేతన చెల్లింపులు జరగలేదు. శ్రీకాకుళం, విజయనగరం, అనంతపురం, కృష్ణా, ప్రకాశం, ఉభయ గోదావరి జిల్లాల్లో కూలీలు అవస్థలు పడుతున్నారు. వేతనాల జాప్యంలో రాష్ట్రానికి సంబంధం లేదని, కేంద్రమే నేరుగా చెల్లిస్తుందని రాష్ట్ర గ్రామీణాభివృద్ధిశాఖ అధికారి ఒకరు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచే ఆలస్యమవుతున్నట్లు ఆయన వివరించారు.
ఇదీ చదవండి: