దేశీయ అతిపెద్ద ఐటీ కంపెనీ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TATA) నవంబర్ నాటికి ఉద్యోగులు కార్యాలయాలకు రావాలని పిలుపునిచ్చింది. కాగ్నిజెంట్ సైతం కొత్త సంవత్సరం ఆరంభం నాటికి... ఎక్కువ మంది సిబ్బంది కార్యాలయాలకు రావాలని సమాచారం అందించింది. ఇలా చిన్న, పెద్ద ఐటీ సంస్థలు (IT Companies) ఇక కార్యాలయాలకు వేళాయే అనే సూచనలు అందిస్తున్నాయి. వాటిలో కొన్నికంపెనీలు ఉద్యోగుల (IT Employees) అంగీకారం కోసం అంతర్గత సర్వేలు చేస్తుండగా... మరికొన్ని సంస్థలు మాత్రం రావాల్సిందేనని ఖరాకండిగా తేల్చి చెబుతున్నాయి. ఉద్యోగులపై ఒత్తిడి తీసుకురాకుండా జాగ్రత్త పడుతూనే అవసరమైన చోట్ల సిబ్బంది సేవలను వారి అభీష్టం మేరకే వినియోగించుకుంటున్నాయి.
ధైర్యంగా అడుగేయవచ్చు...
ఉద్యోగులకు ఆ విషయంలో నేరుగా ఒత్తిడి తీసుకురాకుండా... మేనేజర్ స్థాయి వ్యక్తులు మొదట కార్యాలయాల బాటపడుతున్నారు. వారిని చూసి కిందిస్థాయి సిబ్బంది ధైర్యంగా కార్యాలయాలకు వస్తారని భావిస్తోంది. ప్రభుత్వం, కంపెనీలు కలిసి ప్రత్యేక వ్యాక్సినేషన్ చేపట్టడం వల్ల ఉద్యోగుల్లో 70 శాతం మందికి రెండుడోసుల వ్యాక్సినేషన్, 95 శాతం మంది సింగిల్ డోస్ వ్యాక్సినేషన్‌ను పూర్తి చేసుకోవటంతో ధైర్యంగా అడుగేయవచ్చని భావిస్తున్నాయి.
సిబ్బంది ఆసక్తి...
20 నెలలుగా ఇంటికే పరిమితమైన ఉద్యోగులు (IT Employees) పని ఒత్తిడి భారంతో ఉత్తేజం, ఉల్లాసం దూరమై నాలుగు గోడల మధ్య నీరసించిపోతున్నట్లు... పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి. సిబ్బంది సైతం ఆఫీసులకు వచ్చేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఐటీరంగంలో ఉద్యోగుల వలస... అగ్రశ్రేణి సంస్థలకు తలనొప్పిగా మారింది. కొత్త ఉద్యోగుల ఎంపిక ప్రక్రియను యాజమాన్యాలు వేగవంతం చేస్తున్నాయి. కొవిడ్ తీవ్రత తగ్గుతున్నందున సిబ్బందిని కార్యాలయాలకు రప్పించాలని... కంపెనీలు భావిస్తున్నాయి. క్రమంగా కార్యాలయాలు తెరుచుకుంటున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య భద్రత దృష్ట్యా యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. ప్రస్తుతం 90 శాతం మంది ఇంటి నుంచే పనిచేస్తున్నారు. అవసరాన్ని బట్టి పది నుంచి 20 శాతం ఉద్యోగులను కార్యాలయాల నుంచే పనిచేయించుకుంటున్నారు.
30-40 శాతం ఉద్యోగులు...
వర్క్ ఫ్రం ఆఫీస్ పనివిధానంలో చిన్న, మధ్యతరహా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. వందలోపు సిబ్బంది ఉన్న కంపెనీల్లో 30-40 శాతం ఉద్యోగులు... విధులకు హాజరవుతున్నారు. వచ్చే మార్చినాటికి మెజారిటీ సిబ్బంది కార్యాలయాలకు వస్తారని యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి.
ఇవీ చూడండి :
Visa Issues : వీసా నిబంధనలు, మోసాలతో.. పుట్టింట్లోనే మగ్గుతున్న యువతులు
College Students Protest : ఎఎన్ఆర్, డిఏఆర్ కళాశాల విద్యార్థుల నిరసన...అడ్డుకున్న పోలీసులు