తెలంగాణలో వరంగల్‌లో 1000 పడకలతో ఎంజీఎం ఆసుపత్రి ఎన్నో ఏళ్లుగా సేవలందిస్తున్నా ఇప్పటికీ అన్ని విభాగాల సూపర్ స్పెషాలిటీ(Super Speciality Hospitals) సేవలు లభ్యం కావడం లేదు. గుండెజబ్బు లేదా అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటుకో లేదా హైదరాబాద్‌కో వెళ్లాల్సి వస్తోంది. ఆదిలాబాద్‌లో రిమ్స్ ఆసుపత్రి 500 పడకలతో 2008లో అందుబాటులోకి వచ్చింది. ఇక్కడ కూడా సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలు(Super Speciality Hospitals) లేకపోవడంతో క్లిష్ట పరిస్థితుల్లో రోగులు హైదరాబాద్, నిజామాబాద్, నాగ్‌పుర్ తదితర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఇది ఆర్థికంగా భారమే కాకుండా సుదూర ప్రయాణం చేయాల్సి రావడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటువంటి గడ్డు పరిస్థితులను అధిగమించడానికి ‘ప్రధానమంత్రి స్వస్థ సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై)’ కింద 2015లో వరంగల్‌లోని కాకతీయ వైద్యకళాశాలకు, ఆదిలాబాద్‌లోని రిమ్స్‌కు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు మంజూరయ్యాయి. ఒక్కోదానికి రూ.150 కోట్ల వ్యయంతో మంజూరైన ఈ ఆసుపత్రుల నిధుల్లో కేంద్ర వాటా రూ.120 కోట్లు కాగా.. రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.30 కోట్లు. 2016లో ఈ ఆసుపత్రుల నిర్మాణ పనులు ప్రారంభం కాగా.. ఇటీవలే పూర్తి చేశారు. అధునాతన పరికరాలనూ బిగించారు. అయినా ఇప్పటికీ వైద్యసేవలు ప్రారంభం కాలేదు.
అయినా ఎందుకు జాప్యం?
ఈ ఆసుపత్రుల్లో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్, సహాయ సిబ్బంది నియామకానికి ప్రభుత్వం అనుమతించింది. రిమ్స్‌లో 36 మంది వైద్యనిపుణులు, 144 మంది నర్సులను, వరంగల్‌లో 38 మంది నిపుణులను, 156 మంది నర్సులను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసుకోవడానికి పచ్చజెండా ఊపింది. ఇటీవల ఆన్‌లైన్‌లో నియామక ఇంటర్వ్యూలను నిర్వహించారు. వరంగల్‌లో రేడియాలజీలో ఇద్దరు, మెడికల్ ఆంకాలజీలో ఇద్దరు మినహా మిగిలిన అన్ని పోస్టుల్లోనూ కొత్తగా భర్తీ అయ్యారు. దీంతో గత నెలలో హడావిడిగా ఓపీ సేవలను ప్రారంభించి, మళ్లీ నిలిపివేశారు. ఎందుకనే విషయంలో వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు స్పష్టత ఇవ్వడం లేదు. ఇక ఆదిలాబాద్‌లో 36 మంది వైద్య పోస్టులకు ఇంటర్వ్యూలను నిర్వహించగా.. కార్డియాలజీలో నలుగురు, న్యూరోసర్జరీలో ఇద్దరు, యూరాలజీలో ఇద్దరు చేరారు. మిగిలిన విభాగాలకు వైద్యనిపుణులు ఆసక్తి కనబర్చలేదు. ఇక్కడ ఓపీ, ఐపీ సేవలు కూడా ప్రారంభం కాలేదు.
బోధనకు ప్రత్యేకం
ఆసుపత్రులు చాలా విశాలంగా ఉన్నా 250 పడకల చొప్పునే ఉండటానికి కారణం.. వైద్య విద్యార్థుల బోధనకు ప్రాధాన్యతనివ్వడమేనని వైద్యవర్గాలు తెలిపాయి. ప్రస్తుతం కాకతీయ వైద్య కళాశాలలో చదువుకుంటూ ఎంజీఎంలో అనుభవపూర్వక శిక్షణ పొందుతున్నారు. ఈ బోధనాసుపత్రుల్లో మాత్రం ప్రతి విభాగానికి తరగతి గది ఉంటుంది. స్మార్ట్‌బోర్డు ఆపరేషన్ థియేటర్‌కు అనుసంధానమై ఉంటుంది. వైద్యులు శస్త్రచికిత్స చేస్తుండగానే.. విద్యార్థులు ఆ దృశ్యాలను చూసి నేర్చుకోవచ్చు. ఇక ప్రతి విభాగానికి సంబంధించి ఒక తరగతి గది, ఒక సమావేశ గది, మరో డెమో గదిని నిర్మించారు. ఐసీయూలోని రోగుల పరిస్థితిని వైద్యులు నిరంతరం పర్యవేక్షించేలా వారి సెల్‌ఫోన్లకు అనుసంధానమై ఉంటుంది.
అత్యంత ఖరీదైన పరికరాలు
ఇక వైద్య పరికరాలన్నింటినీ ఇటలీ నుంచి దిగుమతి చేసుకున్నారు. ఇందులో కొన్ని అత్యంత ఖరీదైనవి ఉన్నాయి. ఆపరేటింగ్ మైక్రోస్కోప్ విలువ రూ.1.75 కోట్లు కాగా, రూ.6 కోట్ల విలువైన క్యాత్‌ల్యాబ్ పరికరం ద్వారా గుండె సంబంధిత చికిత్సలు చేయొచ్చు. వీటిలో డిజిటల్ ఎక్స్‌రే పరికరం విలువ రూ.5 కోట్లు. ఆన్‌లైన్‌లోనే రోగి ఫలితం వైద్యులకు చేరుతుంది.
ఆసుపత్రుల్లో ఇవీ ప్రత్యేకతలు
1. కార్డియాలజీ 2. కార్డియోథొరాసిక్ సర్జరీ కార్డియాలజీ 3. నెఫ్రాలజీ 4. యూరాలజీ 5. న్యూరాలజీ 6. న్యూరోసర్జరీ 7. పిడియాట్రిక్ సర్జరీ 8. మెడికల్ గ్యాస్ట్రో ఎంటరాలజీ 9. మెడికల్ ఆంకాలజీ 10. ప్లాస్టిక్ సర్జరీ.
ఈ సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలతో పాటు అడ్వాన్స్‌డ్ ఈఎన్‌టీ, రేడియాలజీ, అనస్థీషియా విభాగాలు కూడా అందుబాటులోకి వస్తాయి.
వైద్యుల అనాసక్తి ఎందుకంటే..
ఒక్కో కార్పొరేట్ ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్యుడికి నెలకు కనీసం రూ.4-5 లక్షల వరకూ వేతనం ఇస్తున్నారు. ఒకవేళ కన్సల్టేషన్ రూపంలో వైద్యసేవలు అందించినా అంతకంటే ఎక్కువే సంపాదించే పరిస్థితులున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వ వైద్యంలో ఒక్కో సూపర్ స్పెషలిస్టు వైద్యుడికి కేవలం రూ.1.25 లక్షల వేతనం ఇస్తుండటంతో ఎక్కువమంది ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. తాత్కాలిక ప్రాతిపదికన నియమిస్తుండటం కూడా విముఖతకు మరో కారణమంటున్నారు.ఆదిలాబాద్ వంటి మారుమూల జిల్లాలో పని చేయడానికి వైద్యనిపుణులు ముందుకు రావాలంటే.. మరింత ఎక్కువ వేతనమిచ్చి, అధిక ప్రయోజనాలను కల్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.
నియామకాలు పూర్తి కాగానే సేవలు
ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులు 52 మంది నియామకం కోసం ప్రకటన జారీ చేయగా ఇంటర్వ్యూలకు 22 మంది హాజరయ్యారు. వీరిలో పది మంది ఇప్పటికే వచ్చి చేరారు. 12 మంది ఇప్పటివరకు రాలేదు. మిగిలిన వారిని నియమించడానికి మరోసారి నియామక ప్రకటన ఇవ్వనున్నాం. నియామకాలు పూర్తికాగానే వైద్యసేవలు ప్రారంభిస్తాం.
నేటి నుంచి ఓపీ
నియామక ప్రక్రియ కొనసాగుతోంది. జులై 2 నుంచి ఓపీ సేవలు ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం. మొదట ఓపీపై దృష్టి పెట్టాం, డిస్‌ఇన్‌ఫెక్షన్ ప్రక్రియ పూర్తయ్యాక ఇన్‌పేషెంట్లు, ఆ తర్వాత సూపర్‌స్పెషాలిటీ విభాగాల్లో శస్త్రచికిత్సలు చేపడతాం.
వారంలో వరంగల్‌లో.. నెలలో ఆదిలాబాద్‌లో
ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ కాకతీయ వైద్య కళాశాలల ఆసుపత్రుల్లో సూపర్ స్పెషలిస్టు వైద్యుల నియామకం దాదాపుగా పూర్తయింది. ప్రస్తుతం పారామెడికల్ పోస్టుల భర్తీపై దృష్టిపెట్టాం. అధునాతన వైద్యపరికరాలను నెలకొల్పినందున నాణ్యమైన సాంకేతిక సహాయకులను నియమించాలని ఆదేశాలిచ్చాం. ఆదిలాబాద్‌లో ఇంకా ఆసుపత్రి పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. పరికరాలను బిగించడం వంటి మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేసి, నెలరోజుల్లోపు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకొస్తాం. ఇక కాకతీయ వైద్యకళాశాలలో వారం రోజుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రారంభిస్తాం.
- ఇదీ చదవండి : ఆ రాష్ట్రానికే కేంద్ర మంత్రివర్గ విస్తరణలో పెద్దపీట!