Weather Forecast: దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడినట్టు భారత వాతావరణ కేంద్రం తెలిపింది. రాగల 24 గంటల్లో క్రమంగా ఇది తమిళనాడు తీరానికి దగ్గరగా వస్తుందని వాతావరణ శాఖ తెలిపింది. ఇది క్రమంగా మరింత పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ.. తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశాలున్నాయి. ఫలితంగా రాగల 48 గంటల్లో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది.
ప్రత్యేకంగా కోస్తాంధ్రలోని నెల్లూరు, రాయలసీమలోని చిత్తూరు, కడప జిల్లాల్లో చాలాచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే సూచనలున్నాయి. ఈనెల 4 నుంచి 6 వరకు వర్షాలు మరింతగా పెరిగే అవకాశముంది. కోస్తాంధ్ర తీర ప్రాంతాల్లో గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే అవకాశముంది. సముద్రం కూడా అల్లకల్లోలంగా ఉంటుందని ఐఎండీ తెలిపింది.