సికింద్రాబాద్ కంటోన్మెంట్ రోడ్ల మూసివేత సమస్యపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు పెద్ద మనసు చాటుకున్నారు. ఈ సమస్యను పరిష్కరించాలని రక్షణశాఖ సహాయ మంత్రి అజయ్‌భట్‌కు సూచించారు. ఉపరాష్ట్రపతితో అజయ్ భట్ మర్యాదపూర్వక భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా కంటోన్మెంట్ సమస్యను అజయ్ భట్‌తో వెంకయ్య నాయుడు ప్రస్తావించారు. మంత్రి కేటీఆర్ రాసిన లేఖ గురించి కూడా రక్షణశాఖ సహాయ మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన అజయ్ భట్ విషయాన్ని పరిశీలించి, తెలియజేస్తామని ఉపరాష్ట్రపతికి తెలిపారు.
రక్షణ శాఖ మంత్రికి కేటీఆర్ లేఖ
కంటోన్మెంట్ పరిధిలో ఉన్న లోకల్ మిలటరీ అథారిటీ రోడ్లను మూసివేయడం పట్ల ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కొద్ది రోజుల కింద కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు లేఖ రాశారు. రహదారులను మూసివేయటం వల్ల లక్షలాది మంది నగరవాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని లేఖలో ప్రస్తావించారు. సికింద్రాబాద్ లోకల్ మిలటరీ అథారిటీ పరిధిలో ఉన్న కీలకమైన అలహాబాద్ గేట్ రోడ్డు, గాఫ్ రోడ్డు, వెల్లింగ్టన్ రోడ్డు, ఆర్డినెన్స్ రోడ్లను కొవిడ్ కేసుల పేరు చెప్పి అధికారులు మూసివేశారని కేటీఆర్ లేఖలో పేర్కొన్నారు. రోడ్లు మూసివేయకుండా సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చి నగరవాసులకు ఊరట కల్పించాలని కోరారు.
ఇదీ చదవండి: