ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని విద్య, ఉద్యోగాల్లో కాపులకు రిజర్వేషన్లు కల్పించడానికి ఉద్దేశించిన కాపు రిజర్వేషన్ బిల్లు-2017 రాష్ట్రపతి ఆమోద ముద్ర కోసం కేంద్ర ప్రభుత్వానికి వచ్చిందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి అజయ్‌కుమార్ మిశ్ర, సామాజిక న్యాయం సాధికారశాఖ సహాయమంత్రి ప్రతిమాభౌమిక్ రాజ్యసభకు తెలిపారు. భాజపా ఎంపీ జీవీఎల్‌నరసింహారావు ఈ అంశంపై అడిగిన వేర్వేరు ప్రశ్నలకు మంత్రులు రాతపూర్వక సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో విద్య, ఉద్యోగావకాశాల్లో కాపులకు, ఆర్థికంగా వెనుకబడిన తరగతుల జాబితాలో 5% రిజర్వేషన్లు కల్పిస్తూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్లు మంత్రులు వెల్లడించారు. సంప్రదాయం ప్రకారం ఆ బిల్లును వివిధ మంత్రిత్వ శాఖలు, డిపార్ట్‌మెంట్ల అభిప్రాయం కోసం పంపించినట్లు పేర్కొన్నారు. కేంద్ర సామాజిక న్యాయం-సాధికార శాఖ, సిబ్బంది వ్యవహారాలు-శిక్షణ శాఖల నుంచి వచ్చిన అభిప్రాయాలను రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలు/వివరణల కోసం పంపినట్లు మంత్రులు సభకు వివరించారు. ఈలోపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాపులకు ‘ది ఆంధ్రప్రదేశ్ ఎకనమికల్లీ వీకర్ సెక్షన్స్ ఆఫ్ సిటిజన్స్ (రిజర్వేషన్ ఆఫ్ సీట్స్ ఇన్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ అపాయింట్‌మెంట్స్ ఆర్ పోస్ట్స్ ఇన్ ద పబ్లిక్ సర్వీసెస్ అండర్ ద స్టేట్ ఫర్ కాపూస్) యాక్ట్ -2019 కింద 5% రిజర్వేషన్లు కల్పించి.. 2019 ఫిబ్రవరి 20వ తేదీన దాన్ని నోటిఫై కూడా చేసినట్లు స్పష్టం చేశారు.
రాష్ట్రపతి అనుమతి కోసం పంపిన బిల్లును ఉపసంహరించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించినట్లు కేంద్ర మంత్రులు తెలిపారు. అందుకు అనుగుణంగా.. 2017నాటి బిల్లును ఉపసంహరించుకుంటున్నట్లు 2019 ఏప్రిల్ 4న రాష్ట్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. ఓబీసీ రిజర్వేషన్లకు కేంద్ర, రాష్ట్ర జాబితాలు వేర్వేరుగా ఉంటాయని.. నిబంధనావళిని అనుసరించి రాష్ట్ర ఓబీసీ జాబితాను సవరించుకొనేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి అర్హత ఉందని మంత్రులు పేర్కొన్నారు. 50% రిజర్వేషన్లను మించి మహారాష్ట్రలో మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన బిల్లు రాష్ట్రపతి అనుమతి కోసం కేంద్రానికి రాలేదని తెలిపారు.
ఇదీ చదవండి: visakha steel: వెనక్కి తగ్గం... విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రం స్పష్టీకరణ