డిస్కంలకు అవసరమైన విద్యుత్తును కేంద్రీకృత ఇంధన కేటాయింపు విధానంలో తక్కువ ధరకు అందించాలని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ భావిస్తోంది. దీనికోసం మార్కెట్ బేస్డ్ ఎకనమిక్ డిస్పాచ్ (ఎంబీఈడీ) విధానాన్ని అమల్లోకి తీసుకురావాలని నిర్ణయించింది. దీని ప్రకారం ఇతర రాష్ట్రాల్లో తక్కువ ధరకు అందుబాటులో ఉన్న విద్యుత్తును అవసరమైన రాష్ట్రానికి అందిస్తుంది. దీనివల్ల డిస్కంల విద్యుత్తు కొనుగోలు వ్యయం తగ్గుతుందని కేంద్రం పేర్కొంది.
ఇందుకోసం డిస్కంలు, విద్యుదుత్పత్తి సంస్థలు రెండూ విధిగా ఒక రోజు ముందుగా బిడ్డింగ్‌ను విద్యుత్తు ఎక్స్ఛేంజీలకు సమర్పించాలి. ‘వన్ నేషన్.. వన్ గ్రిడ్.. వన్ ప్రైస్’ దిశగా విద్యుత్తు రంగాన్ని తీసుకెళ్లాలన్న కేంద్ర ప్రయత్నానికి ఇది దోహదం చేస్తుందని కేంద్ర ఇంధన మంత్రిత్వశాఖ అభిప్రాయపడింది. ఎన్‌టీపీసీ థర్మల్ యూనిట్లలో అందుబాటులో ఉన్న విద్యుత్తు ఆధారంగా ఎంబీఈడీ మొదటి దశను 2022 ఏప్రిల్ నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. మొదటి దశలో ఏపీతోపాటు తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌లలో ఈ విధానాన్ని అమలు చేయనుంది.
ఎంబీఈడీ విధానం అమల్లోకి వస్తే..
రాష్ట్ర అవసరాలకు మించి అందుబాటులో ఉన్న పునరుత్పాదక విద్యుత్తును దేశంలోని ఇతర ప్రాంతాలకు అందించే అవకాశం ఏర్పడుతుంది. దీనివల్ల ఉత్పత్తి ఎక్కువగా ఉన్న సమయంలో తగ్గించాలని ప్రతిపాదించే (కర్టైల్‌మెంట్) సమస్య డిస్కంలకు ఉండదు.
ఉత్పత్తి సంస్థ యూనిట్ వ్యయాన్ని ఎక్స్ఛేంజీకి అందించిన ప్రకారమే వసూలు చేయాలి. ఇంధన, ఇతర ఛార్జీలు పెరిగాయన్న సాకు చూపి చర వ్యయాన్ని పెంచి వసూలు చేసే అవకాశం ఉండదు. ప్రస్తుతం షెడ్యూలు ఆధారంగా ఛార్జీలను ఉత్పత్తి సంస్థ సవరిస్తోంది.
ఇదీ చదవండి: