కేంద్ర ప్రభుత్వం జాతీయస్థాయిలో ఉన్నత విద్యాసంస్థలకు ర్యాంకులు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయిలో కూడా ఇవ్వనున్నారు. సంప్రదాయ డిగ్రీ, పీజీ కళాశాలలతో పాటు ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్‌మెంట్ తదితర కళాశాలలకు ఈ ర్యాంకులు ఇస్తారు. ఈ మేరకు బుధవారం జరిగిన తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సమావేశం నిర్ణయించింది. సమావేశంలో విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్.లింబాద్రితో పాటు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిత్తల్, ఉన్నత విద్యామండలి కార్యదర్శి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో పోటీ పెంచడం ద్వారా క్రమేణా జాతీయస్థాయిలో కూడా కళాశాలలు పాల్గొని తమ స్థానాన్ని మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తాయని సమావేశం అభిప్రాయపడింది. కొత్తగా న్యాక్ గ్రేడ్లను కూడా ర్యాంకింగ్‌లో మిళితం చేస్తారు. కొలమానాలను రూపొందించేందుకు నిపుణుల కమిటీని నియమిస్తారు.
మరికొన్ని ముఖ్యమైన నిర్ణయాలివీ : కొత్త కళాశాలలకు, కోర్సులకు అనుమతి కావాలన్నా, కోర్సులను మార్చుకోవాలన్నా ఇప్పటివరకు ఉన్నత విద్యామండలికి స్వయంగా వచ్చి దరఖాస్తు చేసుకోవాల్సిందే. వాటికి ఆన్‌లైన్ విధానం తీసుకురానున్నారు. ఆయా వర్సిటీల అనుబంధ గుర్తింపును కూడా ఉన్నత విద్యామండలి పర్యవేక్షించనుంది.
- విద్యార్థుల్లో పరిశోధనపై ఆసక్తి పెంచి.. ప్రోత్సహించేందుకు ప్రత్యేకంగా రీసెర్చ్ సెల్ ఏర్పాటుచేస్తారు. ఆ విభాగం ద్వారా ఉత్తమ పరిశోధన చేసిన వారికి నగదు బహుమతులు అందిస్తారు.
- సీఎం కేసీఆర్ సూచించినట్లుగా వచ్చే విద్యా సంవత్సరం నుంచి డిగ్రీలో డ్రగ్స్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీపై అవగాహన కోసం రెండు క్రెడిట్ల కోర్సును అందుబాటులోకి తెస్తారు.
- పీజీ కోర్సులకు రాష్ట్రవ్యాప్తంగా ఒకే విధంగా సిలబస్, కోర్సులు ఉండేందుకు కమిటీని నియమిస్తారు.
- ఏళ్ల తరబడి ఉన్న కళాశాలలకు, కోర్సులకు ప్రవేశాలకు ముందు ఆయా వర్సిటీలు తనిఖీలు చేస్తున్నాయి. ఇప్పటికే ఉన్న వాటికి చివరి క్షణంలో కాకుండా విద్యా సంవత్సరం మధ్యలో అవసరమైతే తనిఖీలు చేయాలి. కొత్తగా కళాశాలలు ఏర్పాటైనా, కొత్త కోర్సులు వస్తే మాత్రం పాత విధానమే కొనసాగుతుంది.
ఇవీ చదవండి: