Bojjala Funerals: తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అంత్యక్రియలు.. ఆయన స్వగ్రామం ఊరందూరులో నేడు జరగనున్నాయి. అధికార లాంఛనాలతో అంత్యక్రియలు జరగాల్సి ఉన్నా అధికారుల నుంచి ఎలాంటి సమాచారం లేదు. అంతిమయాత్రలో చంద్రబాబుతోపాటు, తెలంగాణ సీఎం కేసీఆర్ పాల్గొనే అవకాశం ఉంది. ఆత్మీయ నేతకు కడసారి వీడ్కోలు పలికేందుకు తెదేపా నేతలు పెద్దఎత్తున తరలిరానున్నారు.
మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భౌతికకాయానికి ప్రజలు, పార్టీశ్రేణులు కన్నీటి నివాళులర్పిస్తున్నారు. హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో కన్నుమూసిన బొజ్జల భౌతికకాయాన్ని శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రేణిగుంటకు తీసుకవచ్చారు. అనంతరం రోడ్డు మార్గం ద్వారా శ్రీకాళహస్తికి తరలించారు. ప్రజల సందర్శనార్ధం శ్రీకాళహస్తిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఉంచారు. బొజ్జలను కడసారి చూసేందుకు నియోజకవర్గ ప్రజలు భారీగా తరలివచ్చారు. అనంతరం శ్రీకాళహస్తి నుంచి బొజ్జల స్వగ్రామం తిరుపతి జిల్లా ఊరందూరుకు ఊరేగింపుగా తీసుకెళ్ళారు.
మాజీ మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు అమరరాజా సంస్ధల వ్యవస్ధాపకుడు గల్లా రామచంద్రనాయుడు, అమరా ఆస్పత్రి సీఎండీ గౌరినేని రమాదేవి బొజ్జలకు నివాళులర్పించారు. ఆత్మీయ నేతకు గ్రామస్థులు కన్నీటి నివాళి అర్పించారు. ఆయన చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇవాళ ఊరందూరులోని బొజ్జల వ్యవసాయక్షేత్రంలో ఆయన తల్లిదండ్రుల సమాధి వద్ద.. గోపాలకృష్ణారెడ్డిని ఖననం చేయనున్నారు. తెలుగుదేశం అధినేత చంద్రబాబుతోపాటు పార్టీ శ్రేణులు పెద్దఎత్తున అంత్యక్రియల కార్యక్రమంలో పాల్గొననున్నారు. బొజ్జలకు అత్యంత సన్నిహితుడైన తెలంగాణ సీఎం కేసీఆర్ సైతం వచ్చే అవకాశం ఉంది.
ఇదీ చదవండి:
- మంత్రి వేణుగోపాలకృష్ణకు అమలాపురంలో చేదు అనుభవం
- Polavaram: పోలవరం ప్రాజెక్టు భూసేకరణలో అక్రమాలు.. దళారులతో అధికారులు కుమ్మక్కై
- ఈ లాయర్ అందాలు కేక... హీరోయిన్లకు ఏమాత్రం తగ్గట్లేదుగా!