రాష్ట్రంలో మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో అక్కడక్కడ ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలుచోట్ల చెదురుమదురు ఘటనలు జరిగాయి. విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడలో వైకాపా, తెదేపా వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
* చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం 89 పెద్దూరులో రిగ్గింగ్ చేసేందుకు కొంతమంది యువకుల్ని వైకాపా నేతలు పోలింగ్ కేంద్రంలోకి తీసుకెళ్తున్నారంటూ.. తెదేపా కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం పెరిగి ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది.
* అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బ్రాహ్మణపల్లి పోలింగ్ కేంద్రంలో ఓటేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిని వైకాపా మద్దతుదారు తరఫు పోలింగ్ ఏజెంటు కాలితో తన్నటంతో బాధితుడి తరఫు వర్గం, వైకాపా మద్దతుదారు వర్గం మద్య గొడవ జరిగింది. పోలీసులు ఇరువర్గాల్ని చెదరగొట్టారు.
* విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరులో పోలింగ్ అధికారి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఫిర్యాదు చేయటానికి వెళ్లిన తెదేపా వర్గీయుల్ని వైకాపా నాయకులు అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది.
* కర్నూలు జిల్లా పాములపాడు మండలం ఎర్రగూడూరులో.. పోలింగ్ సమయంలో వైకాపా కార్యకర్తలు డబ్బులు పంపిణీ చేస్తున్నారంటూ తెదేపా కార్యకర్తలు ఆందోళనకు దిగారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదంటూ నిరసన తెలిపారు.
* శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అంపిలిలో తెదేపా బలపరిచిన అభ్యర్థిని పోలీసులు గృహనిర్బంధం చేసి వైకాపా మద్దతుదారును పోలింగ్ కేంద్రానికి అనుమతించటంపై గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేయడంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
గత ఎన్నికలతో పోలిస్తే తక్కువే: డీజీపీ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికలతో పోలిస్తే ఈసారి తక్కువ అల్లర్లు జరిగాయని డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. పోలీసుశాఖ కష్టపడటం వల్లే ఇది సాధ్యపడిందన్నారు. ఎన్నికల బహిష్కరణకు మావోయిస్టులు ఇచ్చిన పిలుపును లెక్కచేయకుండా ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకునేలా చేయగలిగామని వివరించారు. పోలింగ్ కేంద్రాల వద్ద వృద్ధులు, వికలాంగులకు పోలీసు సిబ్బంది సాయం చేశారంటూ వారిని అభినందించారు.
- పోలింగు కేంద్రంలో ఏజెంట్ల ఘర్షణ
విజయనగరం జిల్లా పూసపాటిరేగ మండలం చౌడవాడ పంచాయతీలో పోలింగు ఏజెంట్ల మధ్య ఘర్షణ ఉద్రిక్తతకు దారితీసింది. రెండో వార్డుకు చెందిన ఓ యువతి ఓటువేసి వెళ్లిన రెండు గంటల తర్వాత 11.30కు మళ్లీ వచ్చింది. దీనిపై ఓ వర్గం అభ్యంతరం తెలిపింది. దీనిపై ఇరువర్గాల ఏజెంట్ల మధ్య మాటామాటా పెరిగి కొట్లాటకు దారితీసింది. ఒకరిపై ఒకరు కుర్చీలతో దాడికి దిగడంతో పోలింగ్ సిబ్బంది, ఓటర్లు భయంతో పరుగులు తీశారు. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను అదుపు చేయడంతో అంతా సద్దుమణిగింది. తర్వాత పోలింగు కేంద్రంలో యథావిధిగా ఓటింగు సాగింది.