కేంద్ర ప్రభుత్వ తాజా హరిత పన్ను ప్రతిపాదనపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రవాణా వాహనదారుల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్న వాహనాలను తెగనమ్మి కొత్తవి కొనిపించేలా కేంద్ర వైఖరి ఉందని వారు విశ్లేషిస్తున్నారు. కరోనా కరాళ నృత్యంతో సామాన్యులు ఆర్థికంగా బాగా దెబ్బతిన్న పరిస్థితుల్లో ఇలాంటి ప్రతిపాదన ఏమిటని ప్రశ్నిస్తున్నారు.
హరిత పన్నును పలు రాష్ట్రాలు కొన్నేళ్లుగా అమలు చేస్తున్నాయి. ఆ వడ్డింపు నామమాత్రంగా ఉంటోంది. వాస్తవానికి పన్ను విధించాలా? లేదా? విధిస్తే ఎంత? అన్నది రాష్ట్ర ప్రభుత్వాల స్వేచ్ఛపై ఆధారపడి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల్లో అమల్లో ఉంది. కానీ అంతటా ఒకే విధంగా లేదు. తక్కువగా రూ.50 అత్యధికంగా రూ.4,000 వరకు ఉంది.
కేంద్రం ప్రతిపాదనను దాదాపు అన్ని రాష్ట్రాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎంత మొత్తంలో పన్ను వసూలు చేయాలో కూడా కేంద్రమే నిర్దేశించటం రాష్ట్రాల హక్కుల్లో జోక్యం చేసుకోవటమేనన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. వాహన కాలుష్యాన్ని నియంత్రించాల్సిన అవసరం ఉన్నమాట వాస్తవమే కానీ పూర్తి స్థాయిలో ప్రత్యామ్నాయ మార్గాలను అందుబాటులోకి తీసుకురాకుండా భారీగా వడ్డించాలని కేంద్రం ప్రతిపాదించడాన్ని ముఖ్యంగా రవాణా వాహనదారులు నిరసిస్తున్నారు. పాత వాహనాలను తుక్కు కింద వాహన డీలర్లకు ఇవ్వటం ద్వారా నూతన వాహనం కొనుగోలుకు కొంత రాయితీ ఇచ్చే విధానాన్ని రూపొందించినప్పటికీ అది ఇంత వరకు పురుడు పోసుకోలేదు.
తాజా బడ్జెట్‌లో కాలం చెల్లించిన వాహనాలను తుక్కుగా మార్చేందుకు కేంద్రం ఆమోదించినట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను రవాణా మంత్రిత్వ శాఖ ప్రకటిస్తుందని పేర్కొన్నారు. అధికారుల సమాచారం ప్రకారం 15 సంవత్సరాలు దాటిన వ్యక్తిగత వాహనాలకు హరిత పన్ను చెల్లించి మరో ఐదేళ్లు వినియోగించుకోవచ్చు. ఇరవై ఏళ్ల తర్వాత తుక్కే. అదే వాణిజ్య వాహనాలైతే ఎనిమిదో సంవత్సరం నుంచి 15వ సంవత్సరం వరకు హరిత పన్ను చెల్లించి ఆ తర్వాత తుక్కుగా మార్చాలి.
రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం వసూలు చేస్తున్న హరిత పన్ను
- 7 సంవత్సరాలు దాటిన వాణిజ్య వాహనాలకు ఏడాదికి రూ.200.
- 15 సంవత్సరాలు పూర్తి అయిన వాణిజ్యేతర వాహనాలకు ఏడాదికి రూ.200.
- 15 ఏళ్లు నిండిన మోటారు సైకిళ్లకు ప్రతి అయిదు సంవత్సరాలకు రూ.250
- మోటారు సైకిళ్లు కాని ఇతర వాహనాలకు ప్రతి అయిదేళ్లకు రూ.500
కేంద్రం ప్రతిపాదించిన హరిత పన్ను వివరాలు
- 15 సంవత్సరాలు దాటిన వ్యక్తిగత వాహనదారులు వాహన స్థాయి మేరకు రోడ్ టాక్స్‌లో పది నుంచి 25 శాతం పన్ను చెల్లించాలి. ఏ మొత్తంలో వసూలు చేయాలో ఇంకా ఖరారు కావాల్సి ఉంది.
- 8 సంవత్సరాలు దాటిన రవాణా వాహనాలకు స్థాయి ఆధారంగా వాహన ధ్రువపత్రం తీసుకునే సమయంలో రహదారి(త్రైమాసిక) పన్నులో 10 నుంచి 25 శాతం వసూలు చేయాలి. (దీని ప్రకారం వాణిజ్య వాహనాలపై రూ.ఏడు వేల నుంచి రూ.15 వేల వరకు ఏటా భారం పడుతుందన్నది అంచనా.)
- ప్రజా రవాణాకు ఉపయోగించే సిటీ బస్సులకు తక్కువ మొత్తంలో పన్ను వసూలు చేయాలి.
- భారీగా కాలుష్యాన్ని వెదజల్లుతున్న రాష్ట్రాల్లో హరిత పన్నును 50 శాతం వసూలు చేయాలి.
- విద్యుత్తు, హైబ్రీడ్, సీఎన్జీ, ఎల్పీజీ, ఇథనాల్‌తో నడిచే వాహనాలను, వ్యవసాయ పనులకు వినియోగించే వాహనాలను హరిత పన్ను నుంచి మినహాయించింది.
- వచ్చే ఏడాది ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి 15 సంవత్సరాలు దాటిన ప్రభుత్వ, ప్రభుత్వ రంగం సంస్థల వాహనాలను తుక్కు కింద మార్చాలి.
ప్రోత్సాహకాలు ఇచ్చి అమలు చేయాలి
హరిత పన్నును కేంద్రం భారీగా ప్రతిపాదించింది. వాణిజ్య వాహనాలు ఏడేళ్ల తర్వాత మార్చాలంటే ఆ భారం మరింత ఎక్కువ అవుతుంది. దేశంలోని 16 నగరాల్లో కాలుష్యం పెచ్చుమీరుతున్న నేపథ్యంలో కాలం చెల్లిన వాహనాలను తొలగించే అంశంలో సుప్రీంకోర్టు భూరేలాల్ కమిటీని నియమించింది. ఆ కమిటీ రూపొందించిన జాబితాలో హైదరాబాద్, సికింద్రాబాద్ ఉన్నాయి. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా ఆయా వాహనాలను తొలగించాల్సిందే. ప్రోత్సాహకాలతో కూడిన ప్రణాళికను అమలు చేస్తే ప్రజలపై భారం లేకుండా ఉంటుంది.
- పి.వీరన్న, విశ్రాంత పర్యావరణ శాస్త్రవేత్త
ఇదీ చూడండి: సూకీని విడుదల చేయాలని ప్రపంచ దేశాల ఉద్ఘాటన