రాజన్న సిరిసిల్ల జిల్లాను జోరువానలు, వరద జోరులు ముంచెత్తాయి. ఇప్పటికే చాలా వరకు లోతట్టు ప్రాంతాలు నీట మునిగాయి. వేములవాడలోని మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వేములవాడ బస్టాండ్ నుంచి ఆలయానికి వెళ్లే దారిలో నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది.
అందరూ చూస్తుండగా కూలిపోయిన సెంట్రింగ్
మూలవాగుపై కొత్తగా బ్రిడ్జి నిర్మాణం కోసం సెంట్రింగ్ పనులు జరుగుతున్నాయి. రెండు, మూడు రోజులుగా భారీగా కురుస్తున్న వర్షాలతో మూలవాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో.... బ్రిడ్జి నిర్మాణం కోసం చేపట్టిన సెంట్రింగ్ కుప్పకూలింది. వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తుల రాకపోకలకు వేరు వేరుగా ఇన్, అవుట్ రహదారులు ఉండాలన్న ఉద్దేశంతో... దాదాపు ఐదేళ్ల క్రితం రూ.28 కోట్లతో రెండో వంతెన నిర్మాణం మొదలుపెట్టారు. ఏళ్లుగా సాగుతున్న నిర్మాణం... నిర్మాణ దశలో కూలిపోవడంపై అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు వస్తున్నాయి.
కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పట్టణంలో వాగులు, చెరువులు ఎక్కడికక్కడ ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి. ఏమాత్రం అప్రమత్తంగా ఉన్నా ప్రాణాలు పొట్టనపెట్టుకుంటున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలను ముంచెత్తిన వరదలు.. జనజీవనాన్ని స్తంభింపజేశాయి. ఇళ్లలోకి వరద నీరు చేరి, వాహనాలు వస్తువులు కొట్టుకుపోయి ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా తలదాచుకుందామంటే.. బయటకెళ్లకుండా భారీ వర్షాలు తడిపేస్తున్నాయి. కింద మోకాలి లోతువరకు నీటిలో... పైనుంచి కురుస్తున్న వానలో లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు.
ఇదీ చూడండి: SCHEME FOR DISPUTE RESOLUTION: భూవివాద పరిష్కారానికి కొత్త విధానం