వివిధ గ్రామ పంచాయతీలను సమీపంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో విలీనం చేస్తూ గతేడాది డిసెంబరు 31న ప్రభుత్వం తీసుకొచ్చిన అత్యవసర ఆదేశాలను (ఆర్డినెన్సు) సవాలు చేస్తూ దాఖలైన 22 వ్యాజ్యాలపై మార్చి 3న తుది విచారణ జరుపుతామని హైకోర్టు స్పష్టంచేసింది. ఈనెల 24లోపు కౌంటర్లు దాఖలుచేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. విచారణను మార్చి 3కు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే గోస్వామి, జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్‌ల ధర్మాసనం గురువారం ఈమేరకు ఆదేశాలిచ్చింది. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్, న్యాయవాదులు జీవీ శివాజీ, వాసిరెడ్డి ప్రభునాథ్, పీఎస్‌పీ సురేశ్‌కుమార్, వేదుల శ్రీనివాస్ తదితరులు వాదనలు వినిపించారు. కొన్ని గ్రామాల విలీనాలపై గతంలో జారీచేసిన జీవోలను సవాలు చేయగా.. హైకోర్టు ఆ జీవోల అమలును నిలుపుదల చేసిందని, మరికొన్నింటిని రద్దుచేసిందని తెలిపారు. అయినా మరోసారి గ్రామాల విలీనాలకు ప్రభుత్వం ఆర్డినెన్సు తీసుకొచ్చిందన్నారు. పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించేలా ఆదేశించాలని కోరారు.
రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ ఎస్.శ్రీరామ్ వాదిస్తూ.. వ్యాజ్యాలపై కౌంటరు దాఖలుకు సమయం కోరారు. ఆ తర్వాత తుది విచారణ జరపాలన్నారు. విలీన గ్రామాలకు ఎస్‌ఈసీ ఎన్నికల ప్రకటన ఇవ్వలేదన్నారు. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల వార్డుల పునర్విభజనకు కనీసం 45 రోజులు పడుతుందన్నారు. ధర్మాసనం మార్చి 3న ఈ వ్యాజ్యాలపై తుది విచారణ జరుపుతామని తెలిపింది.
ఇదీ చదవండి: