ఎల్జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విష వాయువు విడుదలపై దర్యాప్తు చేస్తున్న కమిటీలు ఎన్ని?... ఏ కమిటీ ఏ పని చేస్తుందో చెప్పాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్ని హైకోర్టు ఆదేశించింది. ప్రమాదానికి మూలకారణం ఏమిటో వివరించాలంది. మరోవైపు కంపెనీని ఏ ప్రాతిపదికన ఏర్పాటు చేశారు? బాధ్యులు ఎవరు? తదితర వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ఎల్‌జీ పాలిమర్స్ సంస్థను శుక్రవారం హైకోర్టు ఆదేశించింది.
పత్రాలు పరిశ్రమలో ఉన్నందున లోపలికి వెళ్లేందుకు అనుమతివ్వాలని కంపెనీ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. సుప్రీంకోర్టు 30 మందిని లోపలికి అనుమతిచ్చిందన్నారు. మరో ఇద్దర్ని అనుమతించాలని అభ్యర్థించారు. లోపలున్న కొన్ని వస్తువుల్ని విక్రయించకపోతే పాడైపోతాయన్నారు. ఆ వివరాల్ని పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం విచారణను వారం రోజులకు వాయిదా వేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ కె.లలితతో కూడిన ధర్మాసనం శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు జారీచేసింది.
విశాఖ శివారు ఆర్.ఆర్.వెంకటాపురం గ్రామంలోని ఎల్‌జీ పాలిమర్స్ పరిశ్రమ నుంచి విడుదలైన స్టైరీన్ విషవాయువుల వ్యవహారంపై హైకోర్టు సుమోటోగా విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే. శుక్రవారం జరిగిన విచారణలో రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏజీ ఎస్.శ్రీరామ్, కేంద్ర ప్రభుత్వం తరఫున స్టాడింగ్ కౌన్సిళ్లు వైఎస్ మూర్తి, జోస్యుల భాస్కరరావు కౌంటర్లు దాఖలు చేశారు.
ఇవీ చదవండి: