వస్తున్న ఆదాయానికి, అవుతున్న ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఆర్టీసీ అప్పుల్లో ఉంది. గత సంవత్సరం జనవరి నుంచి ఆర్టీసీలోని కార్మికులంతా ప్రభుత్వ ఉద్యోగులు అయ్యారు. ఏడాదికి దాదాపు రూ.3వేల కోట్ల జీతాల భారం తగ్గడంతో.. ఆ మిగులు సొమ్ముతో రుణాలు, ఇతర బకాయిలు తీర్చేద్దామని ఆర్టీసీ భావించింది. ఇంతలో ఆర్టీసీకి వచ్చే రాబడిపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. కొవిడ్ అనంతరం ఆర్టీసీ ఆదాయం క్రమంగా పెరుగుతోంది. దాంతో, ఖర్చులన్నీ పోను మిగిలిన సొమ్ములో నెలకు రూ.50-100 కోట్లు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు ఓ కమిటీ వేసి కసరత్తు చేస్తోంది. ఆర్టీసీకి ఛార్జీలు, కార్గో, దుకాణాల అద్దెలు, స్థలాల లీజుల ద్వారా ఏటా రూ.6వేల కోట్ల రాబడి ఉంటుంది. అందులో జీతాలకు రూ.3 వేల కోట్లు, డీజిల్ వ్యయం, అద్దె బస్సులకు చెల్లింపులు, విడిభాగాల కొనుగోలు, నిర్వహణ ఖర్చులు కలిపి ఏడాదికి రూ.7వేల కోట్ల ఖర్చయ్యేది. ఏటా రూ.వెయ్యి కోట్లు రుణం గానీ, ప్రభుత్వం నుంచి గానీ తీసుకునేవారు. సంస్థకు జీతాల భారం తప్పడంతో బ్యాంకు రుణాలు, ఉద్యోగుల పీఎఫ్ ట్రస్టుకు, స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ (ఎస్‌ఆర్‌బీఎస్), స్టాఫ్ బెనిఫిట్ ట్రస్ట్ (ఎస్‌బీటీ), ఉద్యోగుల సహకార సంఘానికి ఇవ్వాల్సిన బకాయిలు అన్నీ కలిపి రూ.5 వేల కోట్లను చెల్లించవచ్చని భావించారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగా ఉండటంతో.. ఆర్టీసీ రాబడి నుంచి కొంత తీసుకోవచ్చని భావిస్తోంది. ఉద్యోగుల జీతాలు చెల్లిస్తున్నందున రాబడి నుంచి ఎంత తీసుకోవచ్చో పరిశీలిస్తోంది. గత ఏడాది జనవరిలో ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనమైన మూడు నెలలకే ఆర్టీసీ రాబడి నుంచి కొంత ఇవ్వాలని కోరింది. అయితే లాక్‌డౌన్, కొవిడ్‌తో ఆర్టీసీ సర్వీసులు నిలిచిపోయి సంస్థ నష్టపోయింది. కొవిడ్ రెండోదశ తర్వాత ఇప్పుడిప్పుడే రాబడి పెరుగుతోంది. సాధారణ ఆక్యుపెన్సీ రేషియో 75% కాగా, ఇప్పుడు 62-63 శాతానికి చేరింది. రోజువారీ సాధారణ రాబడి రూ.15 కోట్లయితే, ఇప్పుడు రూ.11-12 కోట్లు వస్తోంది. త్వరలో పూర్తిస్థాయి ఓఆర్, రాబడి ఉంటుందని అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆర్టీసీ రాబడిపై దృష్టిపెట్టింది. దీనిపై ఆర్థికశాఖ, ఆర్టీసీ అధికారులతో ఓ కమిటీ వేసి అధ్యయనం చేస్తున్నారు. కమిటీ నివేదిక ఇచ్చాక దీనిని అమలు చేస్తారని తెలిసింది.
రుణాలు, బకాయిల చెల్లింపులు ఎలా?
ఆర్టీసీ రాబడిలో మిగులును ప్రభుత్వం తీసుకుంటే.. సంస్థ అప్పులు, బకాయిలు ఎలా చెల్లిస్తారనేది ప్రశ్నార్థకం అవుతోంది. సంస్థకు బ్యాంకు రుణాలు దాదాపు రూ.2,500 కోట్లు ఉన్నాయి. ఉద్యోగుల విలీనం సందర్భంగా ఎస్‌ఆర్‌బీఎస్, ఎస్‌బీటీని రద్దు చేశారు. అందులో ఉన్న దాదాపు రూ.500 కోట్లు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. పీఎఫ్ ట్రస్ట్‌కు కూడా దాదాపు రూ.వెయ్యి కోట్లు జమ చేయాల్సి ఉంది. సీసీఎస్ బకాయిలు వంటివన్నీ కలిపి రూ.5 వేల కోట్ల వరకు అవసరం అవుతుంది. వీటిని సర్దుబాటు చేయకపోతే.. వడ్డీల భారం పెరిగే వీలుందని తెలుస్తోంది.
ఇదీ చదవండి