రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేయనున్న గ్రామ సచివాలయాల నిర్మాణానికి ఉపాధి హామీ(నరేగా) నిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 4892 గ్రామ సచివాలయాలను కొత్తగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఇప్పటికే 2 వేల 781 గ్రామ సచివాలయాల నిర్మాణానికి పాలనా అనుమతులు ఇచ్చింది.
దీనిపై పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం అధికారులతో సమీక్ష నిర్వహించారు. వీటి నిర్మాణం కోసం తక్కువ ధరకే సిమెంటు అందించేలా ఆయా సంస్థలతో జిల్లా కలెక్టర్లు చర్చలు జరపాలని మంత్రి సూచించారు. గ్రామాల్లో అవసరమైన చోట్ల సీసీ రహదారులు, డ్రైన్ల నిర్మాణం చేపట్టాలని మంత్రి ఆదేశించారు.
ఈ నిర్మాణాలను 30శాతం స్వచ్ఛాంధ్రప్రదేశ్ కార్పొరేషన్తో పాటు మిగిలిన 70 శాతం ఉపాధి నిధులు వినియోగించాలని స్పష్టం చేశారు. అంతర్గత రహదారులు లేని గ్రామాల్లో 90 శాతం ఉపాధి హామీ నిధులతో సీసీ రోడ్లు వేయాలని మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. మరోవైపు రాష్ట్రవ్యాప్తంగా ఓవర్ హెడ్ ట్యాంకులకు రంగులు వేయాలని చెప్పారు. కొత్తగా మంజూరు చేసిన స్కూల్ ప్రహరీ నిర్మాణాలను ఈ నెలాఖరు నాటికి పూర్తి చేయాలన్నారు.
ఇదీ చదవండి