తెలంగాణలో పదో తరగతి వార్షిక పరీక్షల్ని మే 20 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఇంటర్మీడియట్ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 19వ తేదీకి పూర్తికానున్న నేపథ్యంలో.. పదో తరగతి పరీక్షలను మే 20 నుంచి ప్రారంభించి 29వ తేదీతో పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు.
మేలో అధిక ఎండల కారణంగా విద్యార్థులకు సమస్య అవుతుందని ప్రభుత్వం భావిస్తే.. జూన్ మెుదటి వారంలో ప్రారంభించేందుకు అవకాశం ఉందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటివరకు 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈసారి సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఆరు పరీక్షలే ఉంటాయని సమాచారం.
అంతర్గత పరీక్షలు నాలుగుకి... బదులు రెండు ఉంటాయని అధికారులు భావిస్తున్నారు. ఈ అంశంపై ప్రభుత్వం జీవో జారీ చేయాల్సి ఉంటుంది. మరోవైపు 70 శాతం సిలబస్ నుంచే ప్రశ్నపత్రాలను రూపొందించేందుకు ఎస్ఎస్సీ, ఎన్సీఈఆర్టీ కసరత్తు చేస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
ఇదీ చదవండి: క్రైస్ట్ విలేజ్‌ల వ్యాఖ్యలపై ముమ్మర దర్యాప్తు: సీఐడీ ఎస్పీ రాధిక