ఉపరితల ద్రోణుల ప్రభావం లేదు.. అల్పపీడనాల సూచనలూ లేవు.. పేరుకు వానకాలమే అయినా బయటకొస్తే ఎండలు చురుక్కుమనిపిస్తున్నాయి. భారత వాతావరణశాఖ సమాచారం మేరకు చూస్తే.. సోమవారం కర్నూలులో గరిష్ఠ ఉష్ణోగ్రత 37 డిగ్రీలు నమోదైంది. ఇది సాధారణం కంటే 4.6 డిగ్రీలు అధికం. మంగళవారం తుని, మచిలీపట్నంలలో 36.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణోగ్రత ఉంది. ఇది సాధారణం కంటే 3.8 డిగ్రీలు ఎక్కువ. ఒంగోలు, అమరావతి, తిరుపతి తదితర ప్రాంతాల్లోనూ 35 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రమవుతోంది. ఉక్కపోత అధికంగా ఉంటుంది. కొద్ది రోజులుగా వానల్లేకపోవడంతో పైర్లు బెట్టకొచ్చి తలవాలుస్తున్నాయి. మొక్కలు కాపాడుకునేందుకు రైతులు అవస్థలు పడుతున్నారు.
* గతవారంతో పోలిస్తే.. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాలు, పట్టణాల్లో ఉష్ణోగ్రతలు పెరిగాయి. ఎండల తీవ్రత సాధారణం కంటే 2 డిగ్రీల పైనే పెరిగింది.
* సోమవారం..తిరుపతి, మచిలీపట్నంలో 3.3 డిగ్రీలు, విశాఖపట్నం, నర్సాపూర్‌లో 2.6, విజయవాడలో 2.5, కళింగపట్నంలో 2.2 డిగ్రీల చొప్పున సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
* కాకినాడ, కడప, జంగమహేశ్వరపురం, కావలి, బాపట్ల తదితర ప్రాంతాల్లోనూ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.2 డిగ్రీల నుంచి 1.7 డిగ్రీల వరకు ఎక్కువగా ఉన్నాయి.
* ఉష్ణోగ్రతలు పెరిగి ఉక్కపోస్తుండటంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఎండాకాలాన్ని తలపించే వాతావరణంతో.. ఏసీల వినియోగం పెరిగింది.
రెండు రోజులు ఇంతే..
'బంగాళాఖాతంలో ఉపరితల ద్రోణులు లేవు. రుతుపవనాలు బలహీనంగా ఉన్నాయి. దీంతో వర్షాలు కురవడం లేదు. ఉష్ణోగ్రతల ప్రభావం పెరిగింది. 10వ తేదీ తర్వాత వానలు కురిసే అవకాశం ఉంది.' -స్టెల్లా, డైరెక్టర్, అమరావతి వాతావరణ కేంద్రం
ఇదీ చదవండి: నేడు చలో అంతర్వేదికి పిలుపునిచ్చిన భాజపా, జనసేన