'ఒకే దేశం, ఒకే పన్ను' అంటూ 2017 జులై ఒకటో తేదీన వస్తు సేవల పన్ను(జీఎస్టీ)ని కేంద్రం అమల్లోకి తెచ్చింది. నాలుగేళ్లు గడిచాక జీఎస్టీని మంచిదని కానీ, సరళమైనదని కానీ అంగీకరించేవారు కనిపించడం లేదు. జీఎస్టీ తమకెంతో ప్రయోజనకరంగా ఉంటుందని మొదట్లో భావించిన రాష్ట్రాలు, ఇప్పుడు ఆ ప్రయోజనాలను అతిగా ఊహించుకున్నామని వాపోతున్నాయి. తెలంగాణకు రావాల్సిన వందల కోట్ల రూపాయల జీఎస్టీ (వస్తు సేవాపన్ను) ఇతర రాష్ట్రాల ఖాతాల్లోకి చేరుతోంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంతో రాష్ట్రం వందల కోట్ల రూపాయలను నష్టపోతోంది.
హైదరాబాద్ సహా రాష్ట్రంలో చేస్తున్న వ్యాపారం, అందిస్తున్న సేవలకు సంబంధించిన కోట్ల రూపాయల పన్ను ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల ఖజానాల్లో పడుతోంది. 2017లో జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత ఉత్పాదక రాష్ట్రానికి కాకుండా వినియోగ రాష్ట్రానికి పన్ను జమ అయ్యేలా జీఎస్టీ చట్టంలో మార్పులు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఐజీఎస్టీ రూపంలో ప్రతినెలా ఆ మొత్తాన్ని వినియోగ రాష్ట్రానికి అందిస్తుంది. జీఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఈ వ్యవహారం జరుగుతోందని ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
ఇతర రాష్ట్రాలకు ప్రముఖ సంస్థల పన్ను
తెలంగాణలో హైదరాబాద్, వివిధ ప్రాంతాల్లో సెల్యూలార్, బ్యాంకు, బీమా, విద్యాసంస్థలు సేవలందిస్తున్నాయి. ఇవి జీఎస్టీ రిటర్న్‌ల దాఖలు సమయంలో తెలంగాణ పేరు నమోదు చేయకుండా.. హైదరాబాద్ ఇంకా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉన్నట్లు పేర్కొంటుండటంతో ఆ పన్ను మొత్తం ఇతర రాష్ట్రాలకు ఐజీఎస్టీ రూపంలో అందుతోంది. ప్రధానంగా మహారాష్ట్ర, గుడ్‌గావ్, ఆంధ్రప్రదేశ్‌లకు పన్ను చేరుతోంది. ఈ వ్యవహారంపై దృష్టి సారించిన వాణిజ్య పన్నులశాఖ సంబంధిత సంస్థల నుంచి ఇతర రాష్ట్రాలకు చెల్లించిన పన్నును రాబట్టింది. ఎయిర్‌టెల్, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ, ఎల్‌ఐసీ సహా వివిధ సంస్థలు, కొన్ని ప్రముఖ విద్యాసంస్థలు చెల్లించే పన్ను ఇతర రాష్ట్రాలకు వెళ్తుండటం గుర్తించి... వాణిజ్య పన్నులశాఖ సుమారు రూ.200 కోట్లను వెనక్కి తీసుకుంది. ఒక్కో సంస్థ నుంచి రూ.5-30 కోట్ల వరకు రాబట్టింది. హైదరాబాద్‌ను గతంలోలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా సంస్థలు పేర్కొంటుండటంతోనే నష్టం జరుగుతోందని వీటిని గుర్తించే ప్రక్రియ చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
స్వయంగా గుర్తించిన సీఎస్
ఓ ప్రముఖ విద్యాసంస్థ హైదరాబాద్‌లో ఉన్నా ఈ సంస్థ తన సేవలను ఇక్కడి నుంచే అందిస్తున్నా.. సేవా పన్ను మాత్రం హరియాణాకు వెళ్తున్నట్లు వాణిజ్య పన్నుల శాఖను పర్యవేక్షిస్తున్న సీఎస్ సోమేశ్‌కుమార్ గుర్తించారు. ఈ నేపథ్యంలోనే వివిధ సంస్థలను పరిశీలించగా ఈ వ్యవహారం వెలుగు చూసింది. సంబంధిత విద్యాసంస్థ ద్వారా ఇతర రాష్ట్రాలకు వెళ్లిన జీఎస్టీ (సుమారు 4 కోట్ల రూపాయలు) రాష్ట్రానికి వెనక్కి వచ్చింది.
ఇదీ చదవండి: