గత కొంత కాలంగా కేంద్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మధ్య సాగుతున్న ధాన్యం కొనుగోళ్ల వివాదంపై.. రాజకీయ దుమారమే చెలరేగింది. రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతోందని ఆరోపిస్తోన్న తెరాస.. వివిధ రూపాల్లో నిరసన తెలిపింది. చివరికి దిల్లీలోనూ.. ముఖ్యమంత్రి సహా గులాబీ నాయకులంతా నిరసన దీక్ష చేశారు. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను కేంద్రమే కొనాలని.. ధాన్యం సేకరణలో దేశమంతా ఒకే విధానం తీసుకురావాలని డిమాండ్ చేశారు. కేంద్రం కొనేదాకా కొట్లాటే అంటూ.. నేతలు పేర్కొన్నారు.
మరోవైపు.. దేశమంతా ఒకే విధానం అమలు చేస్తున్నామని.. తెలంగాణపై ఎలాంటి వివక్ష లేదని కేంద్రం చెబుతోంది. ముందు జరిగిన ఒప్పందం ప్రకారమే ధాన్యం సేకరిస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఉప్పుడు బియ్యాన్ని సేకరించే పరిస్థితి లేదని.. రా రైస్ ఎంతైన తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నామని పదేపదే ఉద్ఘాటిస్తోంది.
ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? ఒకవేళ కేంద్రం ఇలానే మొండి వైఖరి అవలంబిస్తే.. వడ్లు వేసిన రైతులకు ఎలా న్యాయం చేయాలి..? ఒకవేళ కొనుగోలు చేసినా.. ఆ ధాన్యాన్ని ఏం చేయాలన్న వివిధ అంశాలపై సమావేశంలో చర్చించి స్పష్టమైన నిర్ణయానికి వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఇదీ చూడండి: తిరుపతిలో టోకెన్ల కోసం భక్తుల తోపులాట.. ఐదు రోజులపాటు బ్రేక్ దర్శనాలు రద్దు