Telangana Letter To KRMB: కృష్ణా జలాల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన 811 టీఎంసీల నీటిని తాత్కాలిక ప్రాతిపదికన తెలుగు రాష్ట్రాలు చెరిసగం వినియోగించుకునేలా చూడాలని... కేఆర్ఎంబీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కోరింది. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాలకు సంబంధించి కృష్ణా బోర్డు రూపొందించిన రూల్ కర్వ్స్‌పై సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. అందులో సవరణలు చేయాలని కోరుతూ ఈఎన్సీ మురళీధర్.. కృష్ణా బోర్డు ఛైర్మన్‌కు ఆయన లేఖ రాశారు.
ట్రైబ్యునల్ తీర్పునకు అనుగుణంగా శ్రీశైలంలో సాగునీటి కోసం కనీస వినియోగమట్టాన్ని 830 అడుగులుగానే కొనసాగించాలని మురళీధర్ కోరారు. పోలవరం నుంచి కృష్ణా డెల్టాకు 80 టీఎంసీలు తరలిస్తున్నందున... తెలంగాణకు రావాల్సిన 45 టీఎంసీలను క్యారీ ఓవర్ చేయడం అంగీకారం కాదన్నారు. గోదావరి జలాలను తరలిస్తున్నందున.. సాగర్ నుంచి కృష్ణా డెల్టాకు 72 టీఎంసీలను తరలించాల్సిన అవసరం లేదని తెలిపారు.
కేంద్ర జలసంఘం లెక్కల ప్రకారం శ్రీశైలంలో ఇంకా 282.5 టీఎంసీల నీటి లభ్యత ఉన్నందున... కృష్ణా బేసిన్ అవసరాల కోసం చేపట్టిన కల్వకుర్తి, ఎస్ఎల్బీసీ, నెట్టెంపాడు, డిండి, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలకు.. వెంటనే అనుమతులు ఇవ్వాలని కృష్ణా బోర్డును తెలంగాణ రాష్ట్రం కోరింది. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకొని రూల్ కర్వ్స్‌లో సవరణలు చేయాలని కేఆర్ఎంబీని టీసర్కారు కోరింది.
ఇదీ చూడండి: CENTRAL TEAM: రాష్ట్రంలో ప్రభుత్వ పథకాల అమలుపై కేంద్ర బృందం ఆరా