రాష్ట్రంలో ఆర్థిక అసమానతలు 32 నుంచి 43 శాతానికి పెరిగాయని.. ఫలితంగా మధ్యతరగతి ప్రజలు ఎక్కువగా పేదలుగా మారారని శాసనమండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు పేర్కొన్నారు. ‘సుస్థిర అభివృద్ధి లక్ష్యాల్లో 2018-19లో మూడో స్థానంలో ఉంటే ఇప్పటికీ అదే స్థానంలో కొనసాగుతున్నాం. గతంలో మనకంటే వెనకబడిన రాష్ట్రాలు ప్రస్తుతం 1, 2 స్థానాలకు చేరాయి. సంక్షేమానికి చేసిన ఖర్చులోనూ ఏపీ.. దేశంలో 19వ స్థానంలో ఉంది’ అని ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు.
‘వైకాపా అధికారంలోకి వచ్చాక రూ.2,68,335 కోట్ల అప్పు చేస్తే అందులో రూ.68,632 కోట్లే ప్రత్యక్ష నగదు బదిలీ పథకాలతో ప్రజలకు అందించారు. మిగిలిన రూ.1.99 లక్షల కోట్లు ఏం చేశారనే ప్రశ్నకు ప్రభుత్వం నుంచి సమాధానం లేదు. రెండేళ్లలో పెట్టుబడి వ్యయం కోసం ఖర్చు చేసింది రూ.31వేల కోట్లు మాత్రమే. లెక్కల్లో చూపని రూ.1.99 లక్షల కోట్లలో రూ.31వేల కోట్లు తీసేసినా రూ.1.68 లక్షల కోట్లకు సంబంధించిన లెక్కలేవి?’ అని ప్రశ్నించారు.