గ్రామ సచివాలయ పరీక్షల నిర్వహణ తీరుపై.. తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు.. ముఖ్యమంత్రి జగన్కు బహిరంగ లేఖ రాశారు. గత 4 నెలలుగా వైకాపా పాలనలో రాష్ట్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొందన్నారు. అనుభవ రాహిత్యం, ఆశ్రిత పక్షపాతం, కక్ష సాధింపు వైఖరే ఈ పరిస్థితికి మూలకారణంగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. ఏపీపీఎస్సీ ప్రతిష్ఠకే మాయని మచ్చగా ప్రవేశ పరీక్ష చెడ్డపేరు తెచ్చిందని ఆవేదన చెందారు. దాదాపు 19 లక్షల అభ్యర్థులు, కుటుంబ సభ్యులకు వేదన మిగిల్చిందన్న చంద్రబాబు.. మునుపెన్నడూ లేనంత అధ్వానంగా, అవినీతిమయంగా, అక్రమాలు - అవకతవకల భూయిష్టంగా పరీక్షలు నిర్వహించారని ఆగ్రహించారు.
''ప్రవేశ పరీక్ష నోటిపికేషన్ జులై 26న వస్తే, సెప్టెంబర్ 1నుంచి 8వ తేది దాకా పరీక్షల ప్రక్రియ ప్రారంభించారు. మొత్తం ఉద్యోగాలు లక్షా 26 వేల 728కిగాను లక్షా 98 వేల 164 మంది అర్హత సాధించారని, 56 రోజుల వ్యవధిలోనే ఈ మొత్తాన్ని పూర్తిచేశామని ఆడంబరంగా ప్రకటించారు. అంతే తప్ప వాటిలో ఎన్ని అక్రమాలు జరిగాయో, ఎన్ని అవకతవకలు జరిగాయో, ఎంత అధ్వానంగా పరీక్షల నిర్వహణ ఉందో గాలికి వదిలేశారు. దాదాపు 20లక్షల మంది అభ్యర్ధుల ఆశలను పూర్తిగా వమ్ము చేసి నియామకాల పరీక్షల ప్రక్రియకే తీరని కళంకం తెచ్చారు. ఒక్కో ఉద్యోగాన్ని 4 లక్షల రూపాయలకు అమ్ముకున్నారనే కథనాలను మీడియాలో చూశాం. క్వశ్చన్ పేపర్ లీకేజి అదేదో ఫ్యామిలీ ప్యాకేజిగా మారిందని విమర్శలు వస్తున్నాయి. వాళ్ల బంధువులు, స్నేహితులకే మంచి మార్కులు సాధించారనే వార్తలే క్వశ్చన్ పేపర్ లీకేజి అయ్యిందనడానికి తిరుగులేని రుజువులు. కీ లో అత్యధిక మార్కులు వచ్చినవాళ్లకు ఫలితాల్లో అరకొరగా మార్కులు రావడం, హెల్ప్ లైన్ కు వందలసార్లు కాల్ చేసినా స్పందన లేదని అభ్యర్ధులే ఆరోపించడం అధ్వాన్న పరీక్షా నిర్వహణకు అద్దం పడుతోంది. ప్రశ్నాపత్రాలు ఏపీపీఎస్సీ కన్నా ముందే రిటైర్డ్ అధికారికి ఎలా చేరాయి? కమిషన్ కార్యాలయంలో అవుట్ సోర్సింగ్ సిబ్బందికి క్వశ్చన్ పేపర్లు ఎలా అందాయి? ప్రింటర్లకు క్వశ్చన్ పేపర్ మెయిల్ ఎక్కడ నుంచి వెళ్లింది? అవుట్ సోర్సింగ్ సిబ్బందికి, వాళ్ల బంధువులకే టాప్ ర్యాంకులు దక్కడంలో మతలబు ఏమిటి? ఇందులో ఏపీపీఎస్సీ బాధ్యత ఎంత, పంచాయితీరాజ్ మంత్రిత్వశాఖ, విద్యాశాఖల బాధ్యత ఎంత? మీడియాలో వస్తున్న ఈ ప్రశ్నలకు, ఉద్యోగాలు రాక నిలదీస్తున్న అభ్యర్ధులకు, సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపైనే ఉంది'' అని చంద్రబాబు లేఖలో పేర్కొన్నారు.
జరిగిన దానికి బాధ్యత వహించి గతంలో చేసిన వ్యాఖ్యల ప్రకారం రాజీనామా చేస్తారా.. అని ముఖ్యమంత్రిని చంద్రబాబు ప్రశ్నించారు. జరిగిన అవినీతికి-అక్రమాలకు పూర్తి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే అన్నారు. ఈ పరీక్షలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పారదర్శకంగా మళ్లీ పరీక్షలను నిర్వహించాలని.. అర్హులైన వారికే ఉద్యోగాలు దక్కేలా చూడాలని విజ్ఞప్తి చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ పాపానికి బాధ్యులైన వారిపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలన్న చంద్రబాబు.. క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.