ఉద్యోగుల ఉద్యమం వెనుక తెదేపా ఉందని సీఎం మాట్లాడటం దిగజారుడుతనమని తెదేపా ఎమ్మెల్సీ అశోక్ బాబు మండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఉద్యోగ సంఘాల నాయకులను బ్లాక్ మెయిల్ చేసి ఉద్యమాన్ని నీరుగార్చారని ధ్వజమెత్తారు. నాయకులు స్వార్థం కోసం ఉద్యోగస్తులను మోసం చేయబట్టే..ఆ జేఏసీల్లో నుంచి ఉద్యోగులంతా బయటకొచ్చి కొత్త జేఏసీలతో ఉద్యమానికి సిద్ధమవుతున్నారని వ్యాఖ్యానించారు.
ఉద్యోగుల డిమాండ్లు నెరవేర్చమంటే.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదనటం పచ్చి అబద్ధమని అశోక్ బాబు విమర్శించారు. 2021 డిసెంబర్ నాటికే రూ.97 వేల కోట్ల ఆదాయం వచ్చిందని.., మార్చి నాటికి 1 లక్షా 32 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుందని తెలిపారు. కొవిడ్ సమయంలో రాష్ట్ర ఆదాయం పెరిగింది తప్ప.. తగ్గలేదని స్పష్టం చేశారు. నాడు-నేడు, వైకాపా రంగులు, ఇళ్ల స్థలాల పేరుతో ప్రభుత్వధనాన్ని దోచుకున్నారని.., ఈ అవినీతి లేకపోతే 30 శాతం పీఆర్సీ ఇవ్వొచ్చన్నారు. జగన్ ఉద్యోగులకు చేసిన మోసానికి వాళ్లు రిటర్న్ గిప్ట్ ఇవ్వటం ఖాయమన్నారు.
ప్రతిపక్షాలపై సీఎం జగన్ కామెంట్స్..
CM YS Jagan slams opposition parties: జగనన్న చేదోడు పథకం రెండో విడత నిధుల విడుదల కార్యక్రమంలో మాట్లాడిన సీఎం.. ప్రతిపక్షాల తీరును తప్పుబట్టారు. అమరావతిలో పేదలకు భూములు కేటాయిస్తే అడ్డుకున్నారని విమర్శించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోవట్లేదని.. కానీ అలా జరిగితే ప్రతిపక్షాలకు పండుగే అని దుయ్యబట్టారు. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనట్లేదని తెలిసి ప్రతిపక్షాలు నిరాశ చెందాయంటూ సెటైర్లు విసిరారు.
"ఉద్యోగులు సమ్మెకు వెళ్లాలని ఎవరూ కోరుకోవట్లేదు. అలా సమ్మెలోకి వెళ్తే ప్రతిపక్షాలకు పండుగే. ఉద్యోగులు సమ్మెలో పాల్గొనట్లేదని తెలిసి నిరాశ చెందారు. కమ్యూనిస్టులు ఉద్యోగులను ముందుంచి ఆందోళన చేయిస్తున్నారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టుల ఆందోళనలు చేస్తున్నారు. రాజకీయాలను కలుషితం చేసి విచ్చిన్నం చేసేందుకు యత్నిస్తున్నారు" - ముఖ్యమంత్రి జగన్
ఇదీ చదవండి:
CM Jagan-Cinema Stars Meet: ఎల్లుండి సీఎం జగన్తో సినీ ప్రముఖుల సమావేశం