సీఎం జగన్ ప్రోత్సాహంతోనే తెలుగుదేశం నాయకులపై దాడులు జరుగుతున్నాయని ఆ పార్టీ ఎమ్మెల్సీలు బచ్చుల అర్జనుడు, అశోక్ బాబు, మాజీ ఎమ్మెల్యే ముద్దరబోయిన వెంకటేశ్వరరావులు ఆరోపించారు. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభి ఇంటికి వచ్చిన నేతలు...ఆయనను పరామర్శించారు. ధ్వంసమైన కారును పరిశీలించారు.
దళితులు, ప్రశ్నించే వారిపై జరుగుతున్న దాడులు చూస్తేంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామో రాక్షసపాలనలో ఉన్నామో అర్థం కావట్లేదని తెదేపా ఎమ్మెల్సీలు ధ్వజమెత్తారు. పట్టాభి కారు ధ్వంసం ఘటనను సీఎం ఖండించకపోగా దుష్ట సంప్రదాయాలకు తెరలేపారని విమర్శించారు. కారు అద్దాలు పగలగొట్టో, తప్పుడు కేసులు పెట్టో తెదేపాను భయపెట్టలేరన్నారు.
వైకాపా అవినీతి అరాచకరాలపై ఇక రోజూ మాట్లాడతామన్న నేతలు... చేతనైతే ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలన్నారు. ప్రజల పక్షానలేవనెత్తుతున్న సమస్యలకు సమాధానం చెప్పలేక జగన్ పిరికితనంతో వ్యవహరిస్తున్నారని కొమ్మారెడ్డి పట్టాభి విమర్శించారు. దాడులకు భయపడేది లేదని, రానున్న రోజుల్లో మరింతగా పోరాడతానని స్పష్టం చేశారు.
తెదేపా నేతలపై జరుగుతున్న దాడులను ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటామని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు అన్నారు. దళితులు, తెదేపా నేతలపై ఇప్పటి వరకు సుమారు వెయ్యి దాడులు జరిగాయని మరో ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. ఇటువంటి దాడులకు తెలుగుదేశం భయపడదన్నారు. డబ్బుతో కొంత మంది నాయకుల కొనచ్చేమో గానీ, తెదేపా కార్యకర్తలను కొనలేరన్నారు. వైకాపా చిల్లర రాజకీయాలకు భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : రేపటి నుంచి రాజధాని వ్యాజ్యాలపై రోజువారీ విచారణ