రాష్ట్ర ప్రభుత్వం కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చెప్పే లెక్కల్లో, చేస్తున్న పరీక్షల్లో పారదర్శకత లేదని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. పాలన చేతకాక అసహనంతో ప్రతిపక్షాలపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలోని కరోనా పరిస్థితులపై కేంద్రం, డబ్యూహెచ్ఓ దృష్టి పెట్టాలని కోరారు. లాక్‌డౌన్‌ను లాకప్‌తో పోల్చడం విజయసాయిరెడ్డికే చెల్లిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. హెల్త్ బులెటిన్ లెక్కలకు, వెబ్సైట్లో ఉన్న లెక్కలకు పొంతన లేకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందన్నారు.
జిల్లాల్లోని పరీక్షల వివరాలు కలెక్టర్లు ప్రకటించకుండా మంత్రుల పేషీకి పంపాలంటూ ఆదేశాలివ్వటం ఏంటని ప్రశ్నించారు. సమీక్షల పేరుతో హడావుడి చేస్తున్న ముఖ్యమంత్రి ఏనాడైనా గుంటూరు, కాకినాడ, కర్నూలు మెడికల్ కళాశాల్లోని నిష్ణాతులైన వైద్యులతో మాట్లాడారా అని ప్రశ్నించారు. టెస్ట్ కిట్లు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం ఏ ధరకు కొనుగోలు చేసింది, ఏపీ ప్రభుత్వం ఎంతకు కొనుగోలు చేసిందో చెప్పాలన్నారు. మెడికల్ కిట్లకు సంబంధించిన వివరాలు ఎందుకు బయటపెట్టడం లేదని నిలదీశారు. ముఖ్యమంత్రి మీడియా ముందుకు వచ్చి వాస్తవాలను మాట్లాడలేకపోతున్నారని ఉమా ఆక్షేపించారు.
వరదలొస్తే విహారయాత్రలు చేసిన సీఎం: మంతెన సత్యనారాయణ
ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్ ఇంట్లోంచి బయటికి రాకుండా.. ప్రతిపక్షనేత చంద్రబాబు హైదరాబాద్‌లో ఉన్నారని విమర్శలు చేయటం విడ్డురంగా ఉందని ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు మండిపడ్డారు. లాక్ డౌన్ నిబంధనలు వల్ల చంద్రబాబు హైదరాబాద్‌లో ఉండిపోయారే తప్ప, జగన్‌లా ఇతర దేశానికి వెళ్తే బెయిల్ రద్దు చేస్తారన్న భయంతో కాదన్నారు. వైకాపా ప్రతిపక్షంలో ఉన్న గత ఐదేళ్లలో కనీసం ఐదు రోజులైనా జగన్ ఏపీలో ఉన్నారా అని మంతెన ప్రశ్నించారు. హుద్‌హుద్ సమయంలో జగన్ ఎక్కడున్నారన్నారని నిలదీశారు. గతంలో రాష్ట్రంలో వరదలు వచ్చినప్పుడు ప్రజల్ని పట్టించుకోకుండా... జగన్ తన కుటుంబ సభ్యులతో విహారయాత్రకు విదేశాలకు వెళ్లిన మాట వాస్తవంకాదా అని ప్రశ్నించారు.
చంద్రబాబుపై విమర్శలే ముఖ్యమా?: అయ్యన్న పాత్రుడు
కరోనా వ్యాప్తి నివారణపై ప్రభుత్వ విధానాలు, చేస్తున్న కార్యక్రమాలు చెప్పకుండా ఎంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేయటమే పనిగా పెట్టుకున్నారని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు అన్నారు. కరోనాతో రాష్ట్రం అల్లాడిపోతుంటే వైకాపా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని విమర్శించారు.
ట్రస్టు పేరుతో బెదిరింపులు: బండారు సత్యనారాయణ
వైకాపా ఎంపీ విజయసాయి రెడ్డికి మతి భ్రమించిందని మాజీ ఎమ్మెల్యే బండారు సత్యనారాయణ మూర్తి మండిపడ్డారు. చంద్రబాబుని విమర్శించే స్థాయి విజయసాయికి లేదని హెచ్చరించారు. ప్రధానికి చంద్రబాబు నివేదిక ఇవ్వడాన్ని వైకాపా జీర్ణించుకోలేకపోతుందన్నారు. కరోనా కట్టడిలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్న ఆయన... ట్రస్టు పేరుతో పారిశ్రామిక వేత్తలను విజయసాయి రెడ్డి బెదిరిస్తున్నారని ఆరోపించారు.
ఇదీ చదవండి: