వైకాపా ప్రభుత్వం అమరావతి ఉద్యమాన్ని నీరు గార్చాలని ప్రయత్నిస్తోందని తేదేపా నేతలు ఆరోపించారు. అమరావతి ఉద్యమం ప్రారంభమై ఏడాదైనా రైతులు ఏ మాత్రం వెనక్కి తగ్గట్లేదని అన్నారు. జనభేరి కార్యక్రమంలో తెదేపా నేతలు పాల్గొని అమరావతి ఉద్యమానికి మద్దతు తెలిపారు.
అమరావతి రైతుల కోసం ఎంతవరకైనా పోరాడేందుకు సిద్ధమని ఎంపీ గల్లా జయదేవ్ స్పష్టం చేశారు. అనేక వేధింపులను తట్టుకుని రైతులు, మహిళలు అమరావతి ఉద్యమం సాగిస్తున్నారని అన్నారు. అక్రమ కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదన్నారు. అమరావతి ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని గల్లా జయదేవ్ అన్నారు. వైకాపా ప్రభుత్వంలో అప్పులు పెరిగిపోయాయని.. రాష్ట్రంలో ఆస్తులన్నీ అమ్మేందుకు ప్రణాళికలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
5 కోట్ల మంది మద్దతివ్వాలి..
అమరావతి రాజధానిగా ప్రకటించినప్పుడు జగన్ ఏం మాట్లాడలేదని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఎన్నికల తర్వాత మాట మార్చి 3 రాజధానుల నాటకామాడారని దుయ్యబట్టారు. ఒక్కసారి అవకాశం అడిగి రాష్ట్ర ప్రజల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతి ఉద్యమానికి 5 కోట్లమంది మద్దతివ్వాలి అచ్చెన్నాయుడు కోరారు.
ఇదీ చదవండి: అమరావతి ఉద్యమంపై తొలిసారి స్పందించిన సీఎం జగన్