గుంటూరు జిల్లా నరసరావుపేట నియోజకవర్గం రొంపిచర్ల మండలం ఇస్సాపాలెం పరిధిలో వైకాపా సానుభూతిపరునికి ఓట్లు వేయలేదని.. డ్రైనేజీ మెట్లు, ర్యాంపులు కూల్చివేయటం దారుణమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. పంచాయితీ కార్యదర్శి, పోలీసు అధికారులు దగ్గరుండి కూలగొట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ తరహా ఆటవిక చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
"గోగులపాడు పంచాయతీ 5వ వార్డులో తెదేపా బలపరచిన అభ్యర్థి గెలిచినందుకు వైకాపా ప్రతీకారం తీర్చుకున్నారని మండిపడ్డారు. ప్రజలుప్రత్యర్థిని గెలిపిస్తే వారిపై పగబట్టి, వ్యక్తిగత ఆస్తులను కూల్చివేస్తారా అని నిలదీశారు. ఇది రాజారెడ్డి రాజ్యాంగం నేర్పిన రాజకీయమా అని చంద్రబాబు దుయ్యబట్టారు.
దౌర్జన్యాలు దారుణం..
పంచాయతీ ఎన్నికల్లో ఇళ్ల ముందు డ్రైనేజ్, మెట్లు కొట్టేయటం విధ్వంస పాలనకు పరాకాష్ట అని తెదేపా నేత నారా లోకేశ్ దుయ్యబట్టారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోను ఆయన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గోగులపాడు పంచాయతీలో అత్యధిక వార్డులను తెదేపా మద్దతుదారులు కైవసం చేసుకోవటం జీర్ణించుకోలేక... స్థానిక ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు, పోలీసులు దగ్గరుండి ప్రజలపై దౌర్జన్యం చేయటం దారుణమని మండిపడ్డారు. ప్రజాస్వామ్యాన్ని గౌరవించని వైకాపా నాయకులకు ప్రజలు తగిన శిక్ష విధించే రోజు దగ్గర్లోనే ఉందని హెచ్చరించారు.
ఇదీ చదవండీ.. రేపే.. విశాఖకు చంద్రబాబు.. పల్లా శ్రీనివాస్‌కు పరామర్శ