జై అమరావతి అనేది.. అందరి నినాదం కావాలని రాష్ట్ర ప్రజలకు తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. అమరావతి రాజధానిగా ఉంటుందని సీఎం ప్రకటించేంతవరకూ పోరాడదామని.. గుంటూరు జిల్లా నరసారావుపేటలో నిర్వహించిన బహిరంగ సభలో స్పష్టం చేశారు. అమరావతి కోసం ఎందరో సొంతపనులు వదులుకుని పోరాడుతున్నారని.. ఈ ఉద్యమం వ్యక్తిదో.. పార్టీదో కాదని చెప్పారు. ఒక వ్యక్తి ఈ రాష్ట్రానికి చాలా నష్టం కలిగిస్తున్నారని విమర్శించారు. అమరావతి ఐకాసకు కూలీలు కూడా విరాళం ఇచ్చారని చెప్పారు. డీజీపీ చెప్పారని మహిళలను కొడతారా? ప్రశ్నించిన చంద్రబాబు.. మీకు కుటుంబసభ్యులు లేరా అని పోలీసులను అడుగుతున్నానంటూ వ్యాఖ్యానించారు.
''నేనెప్పుడూ తప్పు చేయను.. చట్టాన్ని గౌరవిస్తా. అమరావతిలో ఉన్న లోపం ఏమిటి?.. ఎందుకు మారుస్తున్నారు? ఈ ప్రభుత్వం చేసిన పనులకు ప్రజలంతా నష్టపోతారు. అమరావతి కాపాడుకోవాలని మాత్రమే నేను అడుగుతున్నా. రాష్ట్రానికి మధ్యలో ఉన్న ప్రాంతం.. అమరావతి. 13 జిల్లాలకూ అందుబాటులో ఉన్న ప్రాంతం.. అమరావతి. కుప్పం నుంచి విశాఖకు రూ.వెయ్యి కిలోమీటర్ల దూరం. వైకాపా తప్ప అన్ని పార్టీలూ అమరావతి ఉద్యమానికి సహకరిస్తున్నాయి. మంచిపని కాబట్టే అందరూ సహకరిస్తున్నారు. మా పార్టీ కార్యాలయం వద్ద 200 మంది పోలీసులను ఉంచారు. ప్రభుత్వం బెదిరించాలని చూస్తే భయపడేవాళ్లు ఎవరూ లేరు. ఇక్కడి పోలీసులపై నమ్మకం లేదని గతంలో జగన్ చెప్పారు. ఇప్పుడు పోలీసులను వాడి ఉద్యమాన్ని అణచేస్తున్నారు'' అని చంద్రబాబు వ్యాఖ్యానించారు.