ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నం (కాన్‌స్టిట్యూషన్ బ్రేక్‌డౌన్) జరుగుతోందా...లేదా... అన్న అంశాన్ని పరిశీలిస్తామని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు అక్టోబరు 1న జారీ చేసిన ఆదేశాలపై సుప్రీంకోర్టు స్టే విధించింది. తాము మళ్లీ ఉత్తర్వులు జారీ చేసేవరకు ఈ వ్యవహారంలో తదుపరి విచారణ చేపట్టవద్దని ఆదేశించింది. ఏపీ హైకోర్టు ఉత్తర్వులను సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్‌లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, ప్రతివాదుల తరఫున సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూత్రా వాదనలు వినిపించారు.
తొలుత తుషార్ మెహతా వాదిస్తూ.... హెబియస్ కార్పస్ పిటిషన్లలో హైకోర్టు ఇలాంటి నిర్ణయం తీసుకోవడం సరికాదన్నారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్‌ఏ బోబ్డే కలగజేసుకుంటూ 'ఇలాంటి ఉత్తర్వులను మేమెప్పుడూ చూడలేదు. హైకోర్టు న్యాయమూర్తి ఏ ఉద్దేశంతో ఈ ఆదేశాలు ఇచ్చారో అర్థం కాలేదు' అని వ్యాఖ్యానించారు. ప్రతివాది తరఫున సిద్ధార్థ లూత్రా వాదిస్తూ.. 'హెబియస్ కార్పస్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది. అందువల్ల హెబియస్ కార్పస్ అంశాన్ని, రాజ్యాంగ విచ్ఛిన్న అంశాలను వేర్వేరుగా చూడాలి. అన్ని అంశాలకూ కలిపి స్టే ఇవ్వొద్దు. హెబియస్ కార్పస్ పిటిషన్‌లో ఉన్న అభ్యర్థనలపై విచారణ కొనసాగించడానికి అనుమతివ్వాలి' అని కోరారు. రెండూ పరస్పరం ముడిపడిన అంశాలని, వాటిని వేర్వేరుగా ఎలా చూస్తామని సీజే ప్రశ్నించారు. న్యాయవాదిగా మీ సర్వీసు ఎంత? మీరు ఎప్పుడైనా ఇలాంటి ఉత్తర్వులు చూశారా? అని ప్రశ్నించారు. సుప్రీంకోర్టుగా ఇది మాకు కలత కలిగిస్తోందంటూ ప్రతివాదులకు నోటీసులు జారీ చేయడంతోపాటు, హైకోర్టు కేసుల ఉత్తర్వులపై స్టే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. క్రిస్మస్ సెలవుల (జనవరి 1) తర్వాత వెంటనే దీన్ని విచారణ జాబితాలో చేర్చాలని ప్రధాన న్యాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ అధికారం రాష్ట్రపతిదే: ఏపీ ప్రభుత్వం
కొందరు వ్యక్తులు దాఖలు చేసిన హెబియస్‌కార్పస్ పిటిషన్ల విచారణ సందర్భంగా 'ఆంధ్రప్రదేశ్‌లో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందా? లేదా' అన్నది తేలుస్తామంటూ జస్టిస్ రాకేష్‌కుమార్ నేతృత్వంలోని ఏపీ హైకోర్టు ధర్మాసనం అక్టోబరు 1న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. వాటిని ఉపసంహరించుకోవాలంటూ రాష్ట్ర ప్రభుత్వం కోరగా జస్టిస్ రాకేష్‌కుమార్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ డిసెంబరు 14న తిరస్కరించింది. 'నేను జారీ చేసిన ఉత్తర్వులను నా ముందే సవాల్ చేయడాన్ని అంగీకరించను. కావాలంటే సుప్రీంకోర్టుకు వెళ్లొచ్చు' అని జస్టిస్ రాకేష్‌కుమార్ వ్యాఖ్యానించడంతో ప్రభుత్వం అదే రోజు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. రాజ్యాంగపరమైన యంత్రాంగం పని చేస్తోందా? లేదా? (బ్రేక్‌డౌన్ ఆఫ్ కాన్‌స్టిట్యూషనల్ మిషనరీ) అని పరిశీలించే అధికారం కేవలం రాష్ట్రపతికి మాత్రమే ఉందని, ఆ అంశాన్ని పరిశీలిస్తానని హైకోర్టు చెప్పడం అధికార వికేంద్రీకరణ సిద్ధాంతానికి వ్యతిరేకమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తన అప్పీల్‌లో పేర్కొంది. 'రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల వైఫల్యాల గురించి ఆర్టికల్ 356 చెబుతోంది. గవర్నర్ ద్వారా నివేదిక అందినప్పుడు కానీ లేదంటే అక్కడున్న ప్రభుత్వం రాజ్యాంగసూత్రాల ప్రకారం నడవడం లేదని రాష్ట్రపతి పూర్తిస్థాయిలో విశ్వసించినప్పుడు కానీ ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధించడానికి వీలుంది. పూర్తిగా రాష్ట్రపతికి సంబంధించిన ఈ అధికారాలను న్యాయవ్యవస్థ చేపట్టడానికి వీల్లేదు' అని ఏపీ ప్రభుత్వం ఈ పిటిషన్‌లో వివరించింది.
'ఈ అధికారాన్ని రాజ్యాంగం ప్రత్యేకంగా అధీకృత సంస్థకు కట్టబెట్టింది. అందువల్ల రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతోందా? లేదా? అని నిర్ణయించడానికి రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన న్యాయస్థానాలకు కొత్తగా న్యాయపరమైన ప్రమాణాలేమీ లేవు. ఈ అంశం పూర్తిగా కార్యనిర్వాహక అధికార పరిధిలోకి వస్తుంది. రాజ్యాంగ విచ్ఛిత్తిపై తేల్చడానికి పూర్తిస్థాయి వాస్తవాల విశ్లేషణ కూడా అవసరం. అందువల్ల కోర్టులు ఈ అంశాన్ని తేల్చలేవు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లేవనెత్తిన ప్రశ్న అసంబద్ధమే కాదు రాజ్యాంగ మూలసూత్రాలకు వ్యతిరేకం కూడా. ఇది పూర్తిగా తప్పు' అని రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ ద్వారా సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లింది.
ఇదీ చదవండి