Teachers Concerns Over PRC: పీఆర్సీ ఫిట్‌మెంట్‌ను 27శాతానికి తగ్గకుండా ఇవ్వాలని, సీపీఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ.. ఉపాధ్యాయులు నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరయ్యారు. భోజన విరామ సమయంలో పీఆర్సీ సాధన సమితి కుదుర్చుకున్న ఒప్పందానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగాయి. శ్రీకాకుళంలోని అంబేద్కర్ కూడలి వద్ద నిరసన తెలిపారు. కాకినాడ నగర తాహసీల్దార్ కార్యాలయం వద్ద ఉపాధ్యాయులు నినాదాలు చేసిన అనంతరం వినతిపత్రం సమర్పించారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం మండల విద్యా వనరుల కేంద్రం వద్ద పీఆర్సీ ఒప్పంద ప్రతులను దహనం చేశారు. విజయవాడలోని చల్లపల్లిబంగ్లా సెంటర్‌లో నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు.
నెల్లూరు జిల్లాలోని వరికుంటపాడు జాతీయ రహదారిపై యూటీఎఫ్, ఏపీటీఎఫ్ నాయకులు పీఆర్సీ సాధన సమితి నాయకుల దిష్టిబొమ్మను ఊరేగించారు. చిత్తూరులో స్థానిక గాంధీ విగ్రహం వద్ద ఆందోళన చేశారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులోని యూటీఎఫ్ కార్యాలయం నుంచి సోమప్ప కూడలి వరకు సోమవారం రాత్రి ర్యాలీ నిర్వహించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట వ్యాయామ ఉపాధ్యాయులు ఆందోళన నిర్వహించారు.
99% మందికి అసంతృప్తి: ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ
పీఆర్సీపై ప్రభుత్వ ప్రకటనతో 99% మంది ఉద్యోగ, ఉపాధ్యాయులు, పింఛనుదారులు నష్టపోయారని... కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది అసంతృప్తిగా ఉన్నారని ఏలూరులో ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ తెలిపారు. ఉపాధ్యాయ సంఘాల నేతలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ‘అశుతోష్ మిశ్ర నివేదికను ప్రాతిపదికగా తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం ఫింట్మెంట్ను ప్రకటించాలి. ప్రభుత్వ ప్రకటనలో 2లక్షల మంది సీపీఎస్ ఉద్యోగుల గురించి, 3లక్షల మంది కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది ఆవేదనపై ప్రస్తావనే లేదు. వీరందరి అసంతృప్తికి ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకుంటుంది’ అని ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ హెచ్చరించారు.
ఇదీ చదవండి: