రాజధాని అమరావతికి వెళ్లాలంటే రాజస్థాన్ ఎడారికి వెళ్తున్నట్లు ఉందని సభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. మిగిలిన వారు ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పలేకపోయారని వెల్లడించారు. దిల్లీలో నిర్వహించిన మీడియా సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. ‘‘అందరూ గర్వించేలా రాజధాని ప్రాంతం ఉండాలి... ప్రతి ఒక్కరూ రాజధానిని చూసి ఇది నాది అనే భావన వ్యక్తం చేయాలి... అమరావతిలో ఆ పరిస్థితి లేదు... మూడు రాజధానుల నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారు. విమర్శలు చేసేవాళ్లు ముందుగా వాస్తవాలను తెలుసుకోవాలి. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో జరిగిన అవినీతిపై కచ్చితంగా చర్యలు తీసుకుంటారు’’ అని తమ్మినేని సీతారాం వ్యాఖ్యానించారు.
అసెంబ్లీ సమావేశాలు ఏ మాత్రం ఆహ్లాదకరంగా జరగడం లేదని.. పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తమ్మినేని అన్నారు. అసెంబ్లీలో సభ్యులు వాడుతున్న భాష విషయంలో అందరూ బాధ్యులేనన్నారు. ఈ సంప్రదాయాలకు ఎక్కడో ఒకచోట అడ్డుకట్ట వేయాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపులను ఇబ్బడిముబ్బడిగా ప్రోత్సహించిన గత ప్రభుత్వానికి ప్రజలు తమ తీర్పుతో గుణపాఠం చెప్పారన్నారు.
ఇదీ చదవండి:రైతులకు మద్దతుగా.. రేపటినుంచి కృష్ణాజిల్లాలో ఆందోళనలు