నైరుతి రుతు పవనాలు సోమవారం కేరళను తాకనున్నాయి. పలు ప్రాంతాల్లో వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది
రెండు రోజుల పాటు వానలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సోమ, మంగళవారాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ నుంచి లక్షదీవుల వరకు తెలంగాణ, రాయలసీమ, దక్షిణ కర్ణాటక, కేరళ మీదుగా 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వివరించింది. మరో వైపు ఆదివారం రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. చిత్తూరు, తూర్పుగోదావరి, కడప, ప్రకాశం తదితర జిల్లాల్లోని పలుచోట్ల జల్లులు కురిశాయి. నెల్లూరు జిల్లా ఆరిమానిపాడులో గరిష్ఠ ఉష్ణోగ్రత 43.57 డిగ్రీల నమోదైంది.
తుపానుగా మారే అవకాశం
ఆగ్నేయ అరేబియా సముద్రం, తూర్పు మధ్య అరేబియా సముద్రం, లక్ష దీవుల ప్రాంతాల్లో ఆదివారం ఉదయం అల్పపీడనం ఏర్పడింది. సోమవారం నాటికి వాయుగుండంగా మారే అవకాశం ఉంది. 24 గంటల్లో తుపానుగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అనంతరం ఉత్తర దిశగా ప్రయాణించి.. జూన్ 3 నాటికి ఉత్తర మహారాష్ట్ర, గుజరాత్ తీరాలకు చేరే అవకాశం ఉందని వివరించింది.
ఇది చదవండి
హైకోర్టు తీర్పును గౌరవించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు: నిమ్మగడ్డ