తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా కొత్తూరు గ్రామానికి చెందిన ముత్కల నర్సయ్య(58) గోదావరిఖనిలో సింగరేణి సంస్థలో పంపు ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు భార్య తార, ఇద్దరు కుమారులు తిరుపతి(35), రాకేష్(32) ఉన్నారు. అనారోగ్య కారణం చూపుతూ(మెడికల్ అన్‌ఫిట్)గతంలో ఒకసారి తన ఉద్యోగాన్ని పెద్ద కుమారుడికి ఇప్పించేందుకు నర్సయ్య ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమవడం, ఉద్యోగ విరమణ సమయం దగ్గర పడుతుండటంతో చివరికి కుటుంబ సభ్యులంతా కలిసి ఆయన హత్యకు పథకం రచించారు.
చంపేశాడిలా...
పథకం ప్రకారం తిరుపతి గత నెల 23న తల్లిని, తమ్ముడిని గోదావరిఖనికి పంపించాడు. 25న రాత్రి గ్రామంలో జరిగిన విందులో మద్యం తాగి, ఇంట్లో నిద్రిస్తున్న తండ్రిని గొంతునులిమి చంపేశాడు. అనంతరం అదే గ్రామంలోని అమ్మమ్మ ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. మరుసటి రోజు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఇంటికి వెళ్లాడు. తండ్రి గుండెపోటుతో చనిపోయాడంటూ బంధువులకు సమాచారం ఇచ్చాడు. అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశాడు.
పోలీసులకు ఫిర్యాదు చేసి దొరికాడు....
తండ్రి ఉద్యోగానికి సంబంధించిన ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ఎఫ్‌ఐఆర్ అవసరం కావటంతో గత నెల 27న తిరుపతి.. ధర్మారం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. అతిగా మద్యం తాగడం, నిద్రలోనే గుండెపోటు రావటంతో తన తండ్రి మరణించినట్టు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన ఎస్సై ప్రేమ్‌కుమార్ విచారణ నిమిత్తం వెంటనే గ్రామానికి వెళ్లారు. చితిపై ఉన్న నర్సయ్య మృతదేహాన్ని పరిశీలించారు. అనుమానంతో పోస్టుమార్టం చేయించారు.
‘గొంతు నులమడం వల్లనే నర్సయ్య మృతిచెందినట్లు వైద్య పరీక్షల్లో తేలింది. కుటుంబ సభ్యులను విచారించాం. కారుణ్య నియామకం కోసం కుటుంబ సభ్యుల అంగీకారంతోనే తండ్రిని హత్య చేసినట్లు తిరుపతి అంగీకరించాడు. నిందితులు తిరుపతి, రాకేష్‌లను శనివారం అరెస్టు చేశాం. మృతుని భార్య తార పరారీలో ఉంది’ అని డీసీపీ తెలిపారు.
ఇదీ చదవండి: ఫ్రూట్ బాక్సుల మధ్య ఫుల్ బాటిల్స్