SI Sexual Harassment : హైదరాబాద్‌లోని మారేడ్‌పల్లి, మల్కాజిగిరి సీసీఎస్ ఎస్సై సంఘటనలు మరవక ముందే కుమురం భీం జిల్లాలోనూ ఓ సబ్ ఇన్‌స్పెక్టర్(ఎస్సై) నుంచి యువతి లైంగిక వేధింపులు ఎదుర్కొన్న ఘటన వెలుగుచూసింది.
పోలీసు ఉద్యోగానికి సన్నద్ధమవుతున్న యువతికి సదరు ఎస్సై ఫోన్ చేసి ఠాణాకు పిలిచారు. పుస్తకాలు ఇస్తామని, ఉద్యోగం వచ్చేలా చేస్తామని మాయమాటలు చెప్పి, అసభ్యంగా ప్రవర్తించారు. ఆందోళన చెందిన యువతి సమీప బంధువుల దగ్గర ఈ విషయం ప్రస్తావించింది. ఈ నేపథ్యంలో వారంతా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు విశ్వసనీయ సమాచారం. సదరు ఎస్సైపై కొన్నాళ్లుగా ఆరోపణలు వస్తున్న క్రమంలో ఇంటెలిజెన్స్ అధికారులు కూడా ప్రత్యేక విచారణ చేస్తున్నట్లు తెలిసింది.