Rayalaseema Special Uggani Bajji Recipe : ప్రతి ప్రాంతానికీ దాని ప్రత్యేకతను చాటిచెప్పే స్వీట్లు, వంటకాలు, టిఫిన్లు ఉంటాయి. పూతరేకులు, మడత కాజాలు గోదావరి జిల్లాల్లో ఎంత ఫేమసో మనందరికీ తెలిసిందే! అయితే, ఉగ్గాని బజ్జీ రాయలసీమ స్పెషల్ టిఫెన్. మీరు కర్నూలు, కడప, అనంతపురం వంటి జిల్లాల్లో ఏ చోటకు వెళ్లినా ఉగ్గాని బజ్జీ అమ్ముతారు. అక్కడి ప్రజలు ఎంతో ఇష్టంగా ఉదయాన్నే ఉగ్గాని బజ్జీ తింటారు. అయితే, కొన్ని టిప్స్ పాటిస్తూ చేసుకుంటే మీరు కూడా రాయలసీమ స్టైల్ ఉగ్గాని బజ్జీ మీ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. మరి ఉగ్గాని బజ్జీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఇప్పుడు చూద్దాం.
కావాల్సిన పదార్థాలు :
- మరమరాలు - 400గ్రాములు
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- టమాటాలు - 3
- ఉల్లిపాయలు - 5
- పసుపు - టీస్పూన్
- కారం - టీస్పూన్
- ఉప్పు - రుచికి సరపడా
- ఆవాలు-అర టీస్పూన్
- జీలకర్ర - టీస్పూన్
- శనగపప్పు - టీస్పూన్
- పచ్చిమిర్చి - 15
- కరివేపాకు - 3
- కొత్తిమీర, పుదీనా కొద్దిగా
- పాలు - గ్లాసు
- నిమ్మరసం - కొద్దిగా
పప్పులపొడి కోసం :
- పుట్నాలపప్పు - పావుకేజీ
- జీలకర్ర - 2 టేబుల్‌స్పూన్లు
తయారీ విధానం :
- ముందుగా పప్పుల పొడి కోసం ఒక మిక్సీ గిన్నెలో పుట్నాలపప్పు, జీలకర్ర వేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ పొడిని ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఆపై మరమరాలను 10 నిమిషాలు నీటిలో నానబెట్టుకోవాలి.
- అనంతరం చేతితో మరమరాలను పిండి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇందులో సగం కప్పు పప్పులపొడి వేసుకుని బాగా కలుపుకోవాలి.
- ఆపై మిక్సీ గిన్నెలో పచ్చిమిర్చి ముక్కలు, కాస్త ఉప్పు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. ఈ పేస్ట్‌ని ఒక గిన్నెలోకి తీసుకోండి.
- ఇప్పుడు స్టౌ ఆన్ చేసి పాన్ పెట్టి ఆయిల్ వేయండి. నూనె వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు వేయండి.
- అవి కాస్త వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి పేస్ట్ వేసి కాసేపు ఫ్రై చేయాలి.
- ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్లోకి మారిన తర్వాత టమాటా ముక్కలు, పసుపు, ఉప్పు, కొత్తిమీర వేసుకుని మిక్స్ చేయండి.
- ఇప్పుడు పాలు పోసుకుని బాగా కలపండి. అలాగే కారం, గ్లాసు నీళ్లు వేసి మిక్స్ చేయండి.
- అనంతరం మరమరాలు వేసుకుని బాగా కలపండి. మసాలా మిశ్రమం మరమరాలకు పట్టిన తర్వాత మిగిలిన పప్పుల పొడి, నిమ్మరసం, కాస్త కొత్తిమీర, పుదీనా తరుగు వేసి మిక్స్ చేయండి.
- ఒక రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి గిన్నె పక్కన పెట్టుకోండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే సూపర్ టేస్టీ ఉగ్గాని రెడీ.
ఇప్పుడు మిర్చి బజ్జీ ఎలా చేయాలో చూద్దాం.
మిర్చి బజ్జీలు చేయడానికి కావాల్సిన పదార్థాలు :
- బజ్జీ మిరపకాయలు -10
- శనగపిండి- కప్పు
- ఉప్పు- రుచికి సరిపడా
- వాము- టీస్పూన్
- వంటసోడా-చిటికెడు
- నీళ్లు- కొద్దిగా
మిర్చి బజ్జీలు తయారీ విధానం :
- ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి శనగపిండి తీసుకోండి. ఇందులో ఉప్పు, వంటసోడా, వాము వేసుకుని కలుపుకోవాలి. ఆపై కొద్దికొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోండి.
- అనంతరం మిర్చిలను శుభ్రంగా కడిగి మధ్యలోకి కట్ చేసుకోండి.
- ఇప్పుడు మిర్చి బజ్జీలు వేయించడానికి స్టవ్ పై గిన్నె పెట్టి సరిపడా ఆయిల్ పోసుకోండి.
- నూనె బాగా వేడైన తర్వాత శనగపిండి మిశ్రమంలో మిర్చి బజ్జీలను చిక్కగా ముంచి ఆయిల్లో ఫ్రై చేసుకోండి.
- మిర్చిలు రెండు వైపులా దోరగా వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోండి. అంతే ఇలా సింపుల్‌గా చేసుకుంటే వేడివేడి మిర్చి బజ్జీ మీ ముందుంటుంది.
- వేడివేడి బజ్జీ, ఉగ్గాని కలిపి తింటే టేస్ట్ అద్దిరిపోతుంది. ఈ ఉగ్గాని బజ్జీ నచ్చితే మీరు కూడా ఓ సారి ట్రై చేయండి.
నోరూరించే ఫ్లఫ్ఫీ బన్ దోసె - నానబెట్టే పనిలేకుండా పది నిమిషాల్లో రెడీ!
అద్దిరిపోయే "రొయ్యల పులావ్" - ఇలా చేస్తే ఇంట్లో వాళ్లకి పండగే!