ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా యూటీఎఫ్, ఏపీటీఎఫ్-1938, పీడీఎఫ్‌లతో పాటు 25 ఉపాధ్యాయ సంఘాలు బలపరిచిన అభ్యర్థి షేక్ సాబ్జీ విజేతగా నిలిచారు. తొలి ప్రాధాన్య ఓట్లతోనే ఆయన విజయం సాధించారని బుధవారం ఎన్నికల అధికారులు ప్రకటించారు. మొత్తం 17,467 మంది ఓటర్లు ఉండగా... 16,054 ఓట్లు పోలయ్యాయి. అందులో షేక్ సాబ్జీకి 7,987 ఓట్లు రాగా... వైకాపాతో పాటు పీఆర్‌టీయూ ఇతర ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో బరిలోకి దిగిన సమీప ప్రత్యర్థి గంధం నారాయణరావుకు 6,453 ఓట్లు దక్కాయి. షేక్ సాబ్జీ 1,534 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 11 మంది స్వతంత్ర అభ్యర్థులుగా పోటీపడ్డారు. వీరిలో తెదేపా మద్దతు తెలిపిన చెరుకూరి సుభాష్ చంద్రబోస్‌కు 706 ఓట్లు, భాజపా మద్దతుతో పోటీ చేసిన ఇళ్ల సత్యనారాయణకు 300 ఓట్లు పడ్డాయి. చెల్లని ఓట్లు 363 నమోదయ్యాయి.
ఇదీ ప్రస్థానం..: పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన షేక్ సాబ్జీ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. ఏలూరు మండలం మాదేపల్లి ఉన్నత పాఠశాలలో స్కూలు అసిస్టెంటుగా పని చేస్తూ.. ఇంకా ఐదేళ్ల సర్వీసు మిగిలి ఉండగానే రాజీనామా చేసి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. 2019 ఫిబ్రవరిలో సీపీఎస్ రద్దు కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో ఏలూరు నుంచి విజయవాడ వరకు నిర్వహించిన పాదయాత్రకు నాయకత్వం వహించారు. ఆయన తండ్రి, తాత, ముత్తాతా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగారు.
విద్యారంగం ప్రక్షాళనపై సీఎం దృష్టి సారించాలి: షేక్ సాబ్జీ
‘ఇద్దరు అధికారులు విద్యాశాఖను ఇష్టారాజ్యంగా నడుపుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని వారిని నియంత్రించాలి. ఉపాధ్యాయులతో, ఉపాధ్యాయ సంఘాలతో మాట్లాడాలి. ఖాళీగా ఉన్న 25వేల ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలి’ అని ఎమ్మెల్సీగా ఎన్నికైన షేక్ సాబ్జీ కోరారు. సీపీఎస్ రద్దు కోసం పోరాడతానని, మంచి పీఆర్సీ ఫిట్‌మెంట్ కోసం, పోగొట్టుకున్న డీఏలు రాబట్టుకోవడానికి కృషి చేస్తానని చెప్పారు.
ఇదీ చదవండి