ఇంజినీరింగ్ ప్రవేశాల కౌన్సెలింగ్(engineering entrance counciling)లో జాప్యం జరుగుతుండటంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ ఏడాది ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం కన్వీనర్ కోటాను ప్రవేశపెట్టారు. ఇంజినీరింగ్ కోర్సులను నిర్వహిస్తున్న 6 వర్సిటీలకు కన్వీనర్ కోటా బోధన రుసుములను నిర్ణయించాల్సి ఉండగా.. ఆ ప్రక్రియా పూర్తవలేదు. మరోవైపు అక్టోబరు 1 నుంచి తరగతులు ప్రారంభించనున్నట్లు ఉన్నత విద్యాశాఖ ఇటీవల ఉమ్మడి అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది. ప్రవేశాల మొదటి విడత కౌన్సెలింగ్‌కే 15 రోజులకు పైగా సమయం పట్టే అవకాశం ఉన్నందున తరగతుల నిర్వహణలోనూ జాప్యం అనివార్యం కానుంది.
గత మూడేళ్లుగా 25 శాతం లోపు ప్రవేశాలున్న 38 కళాశాలల గుర్తింపును నిలిపేయాలని వర్సిటీలు భావిస్తున్నాయి. వీటిలో 22 కళాశాలలు జేఎన్టీయూ కాకినాడ, 16 జేఎన్టీయూ అనంతపురం పరిధిలో ఉన్నాయి. గతేడాది 30 కళాశాలలకు అనుమతులు నిలిపివేశారు. లోపాలను సరిచేసుకున్న వాటికి అనుమతులు ఇచ్చేందుకు రికార్డులను పరిశీలిస్తున్నారు. అదే సమయంలో వర్సిటీలకు 2018-19 నుంచి అనుబంధ గుర్తింపు ఫీజులను చెల్లించని కళాశాలలపైనా చర్యలు తీసుకునేందుకు సమాయత్తమవుతున్నారు.
ప్రైవేటు విశ్వవిద్యాలయాల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటా కింద ప్రభుత్వమే భర్తీ చేయనుంది. వీటికి ఫీజులను ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ నిర్ణయించనుంది. వర్సిటీల ఆదాయ, వ్యయ నివేదికలను పరిశీలించేందుకు సమయం లేనందున వారితో సంప్రదింపుల ద్వారా ఒక్కో సీటుకు 70 వేల రూపాయల వరకు రుసుము ఖరారు చేయాలని భావిస్తున్నారు. దీనిపై ప్రైవేటు వర్సిటీల ప్రతినిధులతో సంప్రదింపులు జరపాల్సి ఉంది.
కౌన్సెలింగ్ ఆలస్యమవుతుండటంతో.... రాష్ట్రంలోని కొందరు విద్యార్థులు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లోని ప్రైవేటు, డీమ్డ్ వర్సిటీల్లో చేరిపోతున్నట్లు సమాచారం. ప్రవేశాల కౌన్సెలింగ్ ఆన్‌లైన్ బాధ్యతలను గత కొన్నేళ్లుగా జాతీయ సమాచార కేంద్రం-ఎన్.ఐ.సీ ద్వారా నిర్వహిస్తుండగా.. ఈసారి మార్పు చేస్తూ ఏపీఆన్‌లైన్, టీసీఎస్‌కు అప్పగించారు.