రాష్ట్ర ప్రభుత్వం నూతన ఇసుక విధానాన్ని ప్రైవేటీకరిస్తూ జయప్రకాశ్ వెంచర్స్ లిమిటెడ్‌కు కట్టబెట్టడం వెనుక క్విడ్‌ప్రోకో దాగి ఉందనే ఆరోపణలను తెలుగుదేశం నేతలు కొనసాగించారు. ప్రభుత్వానికి దమ్ము, ధైర్యం ఉంటే తాము అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ ఓ కరపత్రాన్ని పార్టీ కేంద్ర కార్యాలయంలో విడుదల చేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవినీతిని కేంద్రీకృతం చేస్తూ తన వ్యక్తిగత సంపదను పెంచుకుంటున్నారని తెదేపా అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు.
రాష్ట్రాన్ని ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చి, వేల కోట్ల రూపాయల అవినీతికి జగన్మోహన్ రెడ్డి శ్రీకారం చుట్టారని పట్టాభి ధ్వజమెత్తారు. తాము సంధించిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేని మంత్రి పెద్దిరెడ్డి వందల కోట్ల ప్రజాధనాన్ని పత్రికా ప్రకటనలకు వెచ్చించటం సిగ్గుచేటని దుయ్యబట్టారు. జయప్రకాష్ వెంచర్స్ ముసుగులో జగన్మోహన్ రెడ్డి పదివేల కోట్ల కుంభకోణానికి తెరతీయటం వాస్తవం కాదా అని నిలదీశారు. గంగాధర శాస్త్రిని అడ్డంపెట్టుకుని పెద్దిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి ఈ క్విడ్‌ప్రోకో నడిపారా లేదో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. 2019 ఆర్థిక సంవత్సరానికి జెపీ వెంచర్స్ రూ.3500 కోట్ల నష్టాన్ని ప్రకటించిన మాట వాస్తవం కాదా అని ప్రశ్నించారు.
నష్టాల్లో ఉన్న సంస్థకు ఇసుక కాంట్రాక్టు కట్టబెట్టడంలో లోపాయికారి ఒప్పందం ఏమిటని పట్టాభి నిలదీశారు. తెదేపా హయాంలో 1200 రూపాయలకే ట్రాక్టర్ ఇసుక ఇంటికి చేరేదని... ఇప్పుడు అది దాదాపు రూ.5 వేలకు చేరటం ప్రజా ద్రోహమేనని ధ్వజమెత్తారు. ఏటా 6కోట్ల టన్నుల ఇసుక లభ్యత రాష్ట్రంలో ఉంటే... 2 కోట్ల టన్నులే అంటూ కాకిలెక్కలు చెప్పి... మిగిలిన 4 కోట్ల టన్నులు బ్లాక్ మార్కెటింగ్ చేసుకోవడం ద్వారా రూ.20వేల కోట్ల దోపిడికి తెరలేపారని ఆరోపించారు. అర్హత లేని సంస్థలను ఉద్దేశపూర్వకంగానే టెండర్లో పాల్గొనేలా చేసి జేపీ వెంచర్స్‌కు ఏకపక్షంగా కట్టబెట్టారని దుయ్యబట్టారు.
నూతన ఇసుక విధానం ఎవరి ప్రయోజనాల కోసం తీసుకొచ్చారని పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర నిలదీశారు. భవన నిర్మాణ రంగంపైనే తొలి ప్రభావం పడుతుందని ఆయన మండిపడ్డారు. ఉచిత ఇసుక విధానాన్ని నిలిపివేసిన కారణంగా.. ఉపాధి లేక ఎందరో కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారని... కొత్తగా జేపీ వెంచర్స్‌కు ఇసుక రీచ్‌లు అప్పగించాల్సి రావటం క్విడ్ ప్రోకోలో భాగమేనని ఆరోపించారు. ఇసుక వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపిస్తే అన్ని వాస్తవాలు బయటకొస్తాయని తెదేపా అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ అన్నారు. ఇసుక, మద్యం విధానాలపై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
"జస్టిస్ శివశంకర్రావు ఛైర్మన్‌గా ఏర్పాటైన కమిటీ వంద కోట్ల రూపాయలు దాటిన ప్రతీ టెండర్‌ను న్యాయపరిశీలన చేస్తుందని సొంత మీడియాలో కథనాలు రాయించిన జగన్మోహన్ రెడ్డి... ఇసుక కాంట్రాక్టుపై ఏం సమాధానం చెప్తారు" అని తెదేపా కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం నిలదీశారు. జయప్రకాష్ పవర్ వెంచర్స్ లిమిటెడ్‌కు కట్టబెట్టిన ఇసుక కాంట్రాక్ట్‌పై న్యాయ పరిశీలన చేసి, 15 రోజులు పబ్లిక్ డొమైన్లో పెట్టారా అని నిలదీశారు. శివశంకర్రావు నియామకం కూడా ఉత్తుత్తిదేనా అని మండిపడ్డారు. అబద్ధపు హామీలతో ప్రజలని మోసం చేశారని.. అందుకు జగన్మోహన్ రెడ్డి, మంత్రివర్గం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: