రాష్ట్రంలో రైతు భరోసా కేంద్రాల (ఆర్‌బీకే) పేర్లు మారిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు.. ఇకమీదట వాటిని వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనాలు (అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోరేజీ బిల్డింగులు)గా పిలుస్తారు. వైకాపా ప్రభుత్వం అధికారం చేపట్టాక 10,778 వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేశారు. తొలుత కొన్నిచోట్ల ప్రభుత్వ పాఠశాల భవనాలు, మరికొన్ని చోట్ల ప్రైవేటు భవనాలను అద్దెకు తీసుకొని తాత్కాలిక వసతులు కల్పించారు. అనంతరం 90 శాతం ఉపాధి హామీ పథకం(నరేగా), 10% వ్యవసాయశాఖ నిధులతో శాశ్వత భవనాల నిర్మాణం చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా 10,328 రైతు భరోసా కేంద్రాలకు నిధులు మంజూరయ్యాయి. ఒక్కోటి రూ.21 లక్షల అంచనాతో.. 9 వేల చోట్ల నిర్మాణాలు ప్రారంభించారు. ఇందులో 3 వేలకు పైగా భవన నిర్మాణాలు పూర్తి చేశారు. పూర్తయిన భవనాలకు డా.వైఎస్‌ఆర్ రైతు భరోసా కేంద్రాలుగా నామకరణం చేసి ప్రారంభించారు. దీనిపై భాజపా నాయకులు కేంద్రానికి ఫిర్యాదు చేశారు.
భవన నిర్మాణాలకు నరేగా నిధులు 90 శాతం వినియోగించి.. రాష్ట్ర ప్రభుత్వం తమ పేర్లు పెట్టుకుందని పేర్కొన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం వాటికి అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోరేజీ బిల్డింగులుగా పేరు పెట్టాలని పనులను పర్యవేక్షించిన పీఆర్ ఇంజినీరింగ్ అధికారులకు సూచించింది. ఈ క్రమంలోనే రైతు భరోసా కేంద్రం పేరు తొలగించి.. కొత్తగా వ్యవసాయ ఉత్పత్తి నిల్వ భవనంగా పేరు రాయిస్తున్నారు. మరికొందరు ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇంగ్లీషులోనే అగ్రికల్చర్ ప్రొడ్యూస్ స్టోరేజీ బిల్డింగ్‌గా పేర్లు మారుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో జూపూడి, కేతనకొండ, కొటికలపూడి ఆర్‌బీకేలకు ఈ విధంగానే పంచాయతీరాజ్ శాఖ ఇంజినీరింగ్ అధికారులు ఇంగ్లీషులో పేర్లు రాయించారు.
ఇవీ చదవండి: