AP Tourism Minister Roja: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆర్కే రోజా నేడు బాధ్యతలు చేపట్టారు. సచివాలయం రెండో బ్లాక్‌లో రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా గుమ్మడికాయతో స్వయంగా ఆమె భర్త సెల్వమణి దిష్టి తీశారు.
బాధ్యతలు తీసుకున్న అనంతరం మంత్రి రోజా మాట్లాడుతూ.. పార్టీ పెట్టక ముందు నుంచి సీఎం జగన్ అడుగుజాడల్లో నడిచినట్లు తెలిపారు. మంత్రులుగా ఉన్న వారంతా జగన్ సైనికుల్లా పని చేశారన్నారు. కేబినెట్‌లో కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేసినట్లు వివరించారు. జగన్ అందరికీ న్యాయం చేస్తున్నారన్న రోజా.. ఆయన నమ్ముకాన్ని వమ్ము చేయనని అన్నారు.
‘‘పార్టీ పెట్టక ముందు నుంచి సీఎం జగన్ అడుగుజాడల్లో నడిచాను. మంత్రులుగా ఉన్న వారంతా జగన్ సైనికుల్లా పని చేశారు. కేబినెట్‌లో కుల సమీకరణాల ఆధారంగా కేటాయింపులు చేశారు. పార్టీ కోసం జెండా పట్టుకొని నడిచిన ప్రతి ఒక్కరికీ సీఎం జగన్ న్యాయం చేస్తున్నారు. జగన్ నమ్ముకాన్ని వమ్ము చేయను. రాష్ట్రంలో ఉన్న వనరులను ఉపయోగించుకొని అభివృద్ధి చేస్తాం. సముద్ర తీర ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తాం. విదేశీ పర్యాటకులను ఆకర్షించే విధంగా రాష్ట్రంలో అనుకూలమైన టూరిజంను అభివృద్ధి చేస్తాం. క్రీడలపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధికి కృషి చేస్తాను. గ్రామీణ స్థాయి క్రీడలను ప్రోత్సహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటాం. ఉత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ప్రోత్సాహకాలు అందించడమే కాకుండా క్రీడాకారులకు వసతులు కల్పిస్తాం. ఆర్టిస్ట్‌గా కళాకారుల సమస్యలు నాకు తెలుసు. కళాకారులకు మంచి చేసేలా నిర్ణయాలు తీసుకుంటాను. గండికోట నుంచి బెంగుళూరుకు పర్యాటకం కోసం బస్సు సర్వీసు ఏర్పాటుపై మొదటి సంతకం చేశాను’’ - ఆర్కే రోజా, రాష్ట్ర పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి.
ఇదీ చదవండి : తూచ్.. అంతా వట్టిదే.. బాధేం లేదు: మాజీ హోం మంత్రి